అధికారులు సమన్వయంతో పని చేయాలి
విద్యుత్, తాగునీరు, ఇతర సదుపాయాలు సమకూర్చాలి
పంద్రాగస్టు ఏర్పాట్లపై శాఖల వారీగా అధికారులకు వికాస్ రాజ్ దిశానిర్దేశం
August 15 Celebrations: పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లపై శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు రవాణ, ఆర్అండ్‌బీ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్. స్వాతంత్ర్య వేడుకల ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారాయన. శనివారం గోల్కొండ కోటలో నిర్వహించనున్న స్వాతంత్ర్య వేడుకలు జరిగే ప్రాంతాన్ని గురువారం సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
వర్షాకాలం నేపథ్యంలో కార్యక్రమంలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా వాటర్ ప్రూఫ్ షామియానాలు, వాటర్ ప్రూఫ్ జనరేటర్, నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, బారికేడింగ్, గ్యాలరీలు, అతిథులు, విద్యార్థులు, ప్రజల సీటింగ్ సామర్థ్యం, సౌండ్ సిస్టమ్ తదితర ఏర్పాట్లను ఉన్నతస్థాయి అధికారులతో కలిసి ఆయన సమీక్షించారు. కార్యక్రమ నిర్వహణలో ఎక్కడా ప్రోటోకాల్‌కు ఇబ్బంది కలగకుండా అధికారులు నిబద్ధతతో వ్యవహరించాలని ఆయన సూచించారు. అదే విధంగా స్టేజీ ఏర్పాటుతో పాటు సుందరీకరణ పనులను వేగవంతంగా చేపట్టాలని సూచించారు.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నందున ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రతి వాహనంలో వచ్చే పిల్లలకు ఒక లైజనింగ్ అధికారి తప్పనిసరిగా ఉండేలా చూడాలని విద్యాశాఖ అధికారులతో చెప్పారు.
పంద్రాగస్టు కార్యక్రమానికి ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఘనంగా ఉండాలని, ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లను పక్కాగా, వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రికి సమర్పించే పోలీసుల గౌరవ వందనం, పోలీస్ కవాతును ఆయన ఉన్నతాధికారులతో కలిసి వీక్షించారు.


