స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

Telangana: బొమ్మరాసిపేట్ భూముల స్కాంలో బాధలు ఎవరికి?..

రచన: Venu•••13 నిమిషాల పఠనం

సర్వే నంబర్ 323 నుంచి 409 వరకు మొత్తం 1,049 ఎకరాల భూమికి సంబంధించి కీలక ఆధారాలు ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. 1965లో రిజిస్టర్డ్ జీపీఏ ద్వారా దుగ్గిరాల బలరామకృష్ణయ్యకు హక్కుల బదిలీ జరిగింది. ఇందులో 775 ఎకరాల పట్టా భూమి ఉండగా, సగానికి పైగా భూమిని 1968 నుంచే రైతులకు రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ చేశారు.

భూ బదులాయింపు బోగాలు ఏంటి?

రగులుకుంటున్న అగ్ని

- శామీర్ పేట్ ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ధర్నాకు సిద్ధం

- స్వేచ్ఛ సాక్ష్యాధారాల కథనాలతో హక్కులపై కదం తొక్కుతున్న బాధితులు?

- 50 ఏండ్ల భూ వారసత్వం - 5 ఏండ్ల భూ కుయక్తులతో నష్టం

- వందల ఎకరాలకు కొత్తగా పాస్ బుక్‌లు ఇస్తున్న తీరుపై స్వేచ్ఛ ప్రత్యేక కథనం

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

9848070809

స్వేచ్ఛ చైర్మన్

50 ఏండ్లుగా భూ హక్కులు.. 5 ఏండ్లుగా కుయుక్తులు ఇవే..

స్వేచ్ఛ సాక్ష్యాధారాల కథనాలతో తమ భూ హక్కుల కోసం బాధితులు కదం తొక్కుతున్నారు.ఈ క్రమంలో శామీర్‌పేట్ ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నాకు సిద్ధమవుతున్నారు. 50 ఏళ్లుగా కొనసాగుతున్న భూ వారసత్వాన్ని కేవలం ఐదేళ్లలో జరిగిన భూ కుయుక్తులతో దెబ్బతీశారని ఆరోపిస్తున్నారు. వందల ఎకరాలకు కొత్తగా పాస్‌బుక్‌లు జారీ చేస్తున్న తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ భూములకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

సర్వే నంబర్ 323 నుంచి 409 వరకు మొత్తం 1,049 ఎకరాల భూమికి సంబంధించి కీలక ఆధారాలు ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. 1965లో రిజిస్టర్డ్ జీపీఏ ద్వారా దుగ్గిరాల బలరామకృష్ణయ్యకు హక్కుల బదిలీ జరిగింది. ఇందులో 775 ఎకరాల పట్టా భూమి ఉండగా, సగానికి పైగా భూమిని 1968 నుంచే రైతులకు రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ చేశారు. మిగతా భూములకు 1972లో పీటీ 50బీ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. 1975లో ల్యాండ్ సీలింగ్ అథారిటీలో జీరో ల్యాండ్ హోల్డింగ్ డిక్లరేషన్, మరో 255 ఎకరాల ఇనాం భూములకు రైతుల పేరిట ఓఆర్సీలు జారీ అయినట్లు ఆధారాలు ఉన్నాయి.

మరోవైపు 1998, 1999లో 50బీ సర్టిఫికేట్స్ రద్దు చేస్తూ, సర్టిఫై కాపీ లేని ఉత్తర్వులు ఆర్డీవో ఇచ్చారు. సర్టిఫికేట్ రద్దు చేసే హక్కు టెనెన్సీ చట్ట ప్రకారం కలెక్టర్‌కే ఉంటుంది. కానీ, ఆర్డవో రద్దు చేశారు. ఆ పక్రియలో ప్రొసిడింగ్స్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్క ఆర్డర్‌లో ప్రతివాదులు లేకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు.. ఎవరికి నోటీసులు జారీ చేయలేదు. దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లోనే ఉత్తర్వులు పాస్ చేశారు.

ఒకవైపు 1,049 ఎకరాల భూములపై హక్కులు, రికార్డులు, రిజిస్ట్రేషన్లకు సంబంధించి వివాదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు గత ఐదేళ్లుగా ఈ భూములపై రకరకాల ఆరోపణలు, ప్రత్యారోపణలు వినిపిస్తున్నాయి. అయితే అసలు రికార్డులు ఏం చెబుతున్నాయి? ఎవరి వాదనలో వాస్తవం ఉంది? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో సంబంధిత రెవెన్యూ ఫైళ్లను అధికారులు ముట్టుకోలేదని నాటి ఆర్డీవో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆ రెండు ఫైళ్లు నకిలీవని, కబ్జాదారులు సృష్టించిన బోగస్ పత్రాలని ఆరోపణలు వచ్చాయి. మరోవైపు.. దాదాపు 50 ఏళ్లుగా ఈ భూములకు కోట్లాది రూపాయల విలువైన లావాదేవీలు జరిగాయి. స్టాంప్ డ్యూటీలు చెల్లించారు. ఇదే రెవెన్యూ అధికారులు పట్టా పాస్‌బుక్‌లు జారీ చేశారు..

రెవెన్యూ రికార్డుల్లో పేర్లు మారాయి. నాలా కన్వర్షన్ కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఎలాంటి కోర్టు ఆదేశాలు లేకుండానే భూములను ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో పెట్టి, అసలైన పట్టాదారులకు బదలాయింపులు నిలిపివేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో 1965లో రిజిస్టర్‌డ్ జీపీఏ ద్వారా హక్కులు పొందిన వారసులు అప్లికేషన్లు పెట్టగానే, వంద ఎకరాలకు పైగా భూములకు పొజిషన్ ఎంక్వైరీ కూడా లేకుండా, అడ్వకేట్ జనరల్ ఓపీనియన్ పేరుతో హడావుడిగా పాస్‌బుక్‌లు జారీ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మొత్తం 1,049 ఎకరాల క్రయవిక్రయాల్లో సుమారు 67 ఎకరాలు ఫేక్ వ్యక్తులతో రిజిస్ట్రేషన్లు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశాలపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. అయితే వాటిని కోర్టులో నిరూపించలేకపోయారన్న వాదన ఉంది. సివిల్ కేసులో మాత్రం సుమారు 7 ఎకరాలకు సంబంధించిన సేల్ డీడ్స్ రద్దు చేయాలని ఎల్బీనగర్ కోర్టు ఆదేశాలు ఇచ్చిందని, ఆ తీర్పుపై అప్పీల్ విచారణ కొనసాగుతోందని చెబుతున్నారు.

అయితే వందల ఎకరాలు తమవేనంటూ అప్లికేషన్ పెట్టగానే కేవలం 30 రోజుల్లో క్లియర్ చేయడం ఎలా సాధ్యమవుతోంది? ఇదంతా భూ హక్కులపై మరింత అనుమానాలకు తావిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక గత ఐదేళ్లుగా ప్రచారంలో ఉన్న కొన్ని ప్రధాన వాదనలపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 21 మంది వారసుల నుంచి భూములు కొనుగోలు చేసి, రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసుకున్నారని చెబుతున్నారు.

సాదా బైనామీలతోనే భూములన్నీ కొట్టేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ ఆ ఆరోపణల్లో 1965లో నమోదైన రిజిస్టర్‌డ్ జీపీఏల ప్రస్తావన ఎందుకు కనిపించదన్న ప్రశ్న ఉంది. అలాగే ఆర్వోఆర్ చట్టం ప్రకారం 1989లో సాదా బైనామా ప్రక్రియ ఉందని చెబుతున్నప్పటికీ, 1981లోనే రికార్డులు మార్చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. 1975 సీలింగ్ యాక్ట్ కింద జరిగిన డిక్లరేషన్లు, 1970లలో ప్రభుత్వం ఇచ్చిన 50-బి సర్టిఫికెట్లు, ఓఆర్సీల అంశాలు ఎందుకు ప్రస్తావనకు రావడం లేదన్న ప్రశ్నలు ఉన్నాయి.

అదేవిధంగా 50-బి సర్టిఫికెట్ల చట్టం ప్రకారం కలెక్టర్ పరిధిలో ఉండాల్సిన రద్దు ప్రక్రియను ఆర్డీవో రద్దు చేశారంటూ అధికారిక రికార్డుల్లో లేని పత్రాలను చూపిస్తున్నారన్న ఆరోపణలపైనా స్పష్టత రావాల్సి ఉంది. కొందరు రైతులు 1999లో హైకోర్టును ఆశ్రయించి తర్వాత పిటిషన్లు వెనక్కి తీసుకున్నారని చెబుతున్నారు. అయితే అప్పటి నుంచి భూములను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? 2021, 2022లోనే కొత్తగా ఈ వివాదం ఎందుకు తెరపైకి వచ్చింది? అనే ప్రశ్నలు ఉన్నాయి.

ఇక 1982లో మరణించిన అట్లూరి శ్రీనివాసమ్మ పేరుతో 382 సర్వే నంబర్‌లో 12 ఎకరాలకు సంబంధించిన జీపీఏలు దొంగ వ్యక్తులతో సృష్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే 2004లో అమెరికాలో ఉన్న గౌతమి కృష్ణకుమారి పేరుతో మరో వ్యక్తిని చూపించి 15 ఎకరాల వ్యవహారంలో ఇషా ఖాన్‌పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు. కానీ ఆ కేసులు ఎందుకు నిరూపించలేకపోయారు? మరో 40 ఎకరాలకు సంబంధించి గౌతమి పేరుతో ఇన్‌ఫర్మేషన్‌ చేసినట్లు చెబుతున్న వ్యవహారంలో ఇప్పటివరకు క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు కాలేదు? సేల్ డీడ్స్‌ను కోర్టు ద్వారా ఎందుకు రద్దు చేయించలేకపోయారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

1981లోనే పత్రాలు ఫేక్‌గా సృష్టించారన్న ఆరోపణ ఉంది. అయితే పట్టా పాస్‌బుక్ చట్టం కూడా అప్పటికి రాలేదని వాదిస్తే, ఆ పత్రాలు ఎప్పుడు, ఎలా సృష్టించబడ్డాయి? నిజంగానే భూములను కబ్జా చేయాలనే ఉద్దేశం ఉంటే అప్పట్లోనే మాదాపూర్, గచ్చిబౌలి వంటి అత్యంత విలువైన ప్రాంతాల్లో ఎందుకు కబ్జా చేయలేదన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది.

1975లో ఫేక్ ఓఆర్సీ నంబర్లతో 273 ఎకరాలు కాజేశారన్న ఆరోపణ ఉంది. సంబంధిత ఫైల్ నంబర్ లీగల్ హెయిర్ సర్టిఫికెట్‌కు సంబంధించినదని చెబుతున్నారు. అయితే దాదాపు 50 ఏళ్లుగా ఓఆర్సీ కోసం ఎలాంటి అప్లికేషన్ ఎందుకు పెట్టలేదు? ఆర్డీవో జారీ చేయాల్సిన ఓఆర్సీలను ఎమ్మార్వో జారీ చేశారంటే, వాటి రద్దు కోసం మూడేళ్ల క్రితం వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? జాయింట్ కలెక్టర్ వద్ద అప్పీల్‌కు వెళ్లినప్పుడు హైకోర్టు స్టే ఇచ్చిందన్నది వాస్తవం కాదా? ఓఆర్సీలపై హైకోర్టు ఫుల్ బెంచ్ తీర్పుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉందన్న విషయం తెలియదా? అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి.

విలువైన భూములను దారాదత్తం చేసిన అమోయ్ కుమార్ ఉత్తర్వులను ఆధారంగా చేసుకుని సుమారు 1,000 ఎకరాలను ఉచితంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం అప్పట్లో ఓ ఎమ్మెల్సీని ధరణి పేరుతో అమెరికా, అంధ్రా బ్యాచ్ ని రంగంలోకి దింపారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే వీటిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందన్న డిమాండ్లు ఉన్నాయి.

ఏళ్ల తరబడి ముందుకు కదలని ఫైళ్లు ఒక్కసారిగా 24 గంటల్లోనే ఎమ్మార్వో కార్యాలయం నుంచి అడ్వకేట్ జనరల్ కార్యాలయానికి, అక్కడి నుంచి కలెక్టర్ కార్యాలయం, సీసీఎల్‌ఏ వరకు ఎలా వెళ్లాయి? ఇందులో నిబంధనల ప్రక్రియ మొత్తం పాటించారా? లేక ఫైళ్లను వేగంగా క్లియర్ చేయడానికి ఏదైనా ప్రత్యేక ఒత్తిడి లేదా కుట్ర జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చివరిగా 1,049 ఎకరాల భూముల వ్యవహారంలో ఎవరి హక్కులు నిజమైనవి? ఏ పత్రాలు చట్టబద్ధమైనవి? రికార్డులు ఎలా మారాయి? గతంలో పట్టాలు, పాస్‌బుక్‌లు, నాలా కన్వర్షన్లు జారీ చేసిన అధికారులు ఏ ఆధారాలను పరిశీలించారు? ఇప్పుడు వాటికి భిన్నంగా నిర్ణయాలు ఎందుకు వస్తున్నాయి? అన్న ప్రశ్నలకు అధికారిక రికార్డులు, కోర్టు తీర్పులు, సమగ్ర విచారణ ద్వారా స్పష్టత రావాల్సి ఉంది.

#Hyderabad#Medchal#Shamirpet#Bommarasipeta land scam#Farmers Struggle
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి