తెలంగాణలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే రాబడి ప్రభుత్వానికి గణనీయంగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చిన అదనపు ఆదాయం కేవలం ఏడు నెలల్లోనే ఏకంగా 1,408 కోట్ల రూపాయలు.. ఇక 2025తో పోలిస్తే 2026లో ప్రతి నెలా ఆదాయం పెరుగుతూ వచ్చింది.
సాగు భూములు, వ్యవసాయేతర స్థలాలు, ఇళ్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ సంవత్సరం ప్రభుత్వ ఖజానాకు 10,114 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇదే సమయంలో 2025లో 8,706 కోట్ల రూపాయల రాబడి నమోదైంది. అంటే.. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 1,408 కోట్ల రూపాయల మేర అదనపు ఆదాయం వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఈ ఏడాది ప్రారంభం నుంచే రిజిస్ట్రేషన్ల ఆదాయం ప్రతి నెలా పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా.. భూముల మార్కెట్ విలువల సవరణను ప్రభుత్వం ముందుగానే ప్రకటించడంతో మే నెలలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం గణనీయంగా పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. మే నెలలోనే సుమారు 300 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత జూన్, జూలై నెలల్లోనూ రిజిస్ట్రేషన్ల ఆదాయంలో అదే జోరు కొనసాగింది. భూముల విక్రయాలు తగ్గిపోయాయని, తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం మందగించిందని జరుగుతున్న ప్రచారానికి ఈ గణాంకాలు సరైన సమాధానాలుగా నిలిచాయి. మరోవైపు భూముల ధరలను ప్రభుత్వం సవరించినప్పటికీ.. రిజిస్ట్రేషన్ల సంఖ్య, తద్వారా ప్రభుత్వ ఆదాయంపై ప్రతికూల ప్రభావం కనిపించకపోవడం గమనార్హం.
కొనుగోళ్లు, అమ్మకాలు కొనసాగుతున్నాయనే విషయాన్ని రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం స్పష్టం చేస్తోంది. మొత్తంగా.. 2026లో ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ల ద్వారా 10,114 కోట్ల రూపాయల ఆదాయం రావడం.. తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో లావాదేవీలు కొనసాగుతున్నాయనే సంకేతాలను ఇస్తోంది. గతేడాదితో పోలిస్తే 1,408 కోట్ల రూపాయల అదనపు రాబడి రావడంతో.. ప్రభుత్వ ఖజానాకు రిజిస్ట్రేషన్లు మరోసారి కీలక ఆదాయ వనరుగా నిలిచాయని స్పష్టం అవుతున్నాయి..



