Spirituality

Spirituality: త్రికరణ శుద్ధి ఎలా సాధ్యం.. జీవితాన్ని మార్చే ఆధ్యాత్మిక రహస్యం!..

రచన: Venu••4 నిమిషాల పఠనం

చేతులు ధర్మం చేస్తూ.. నోరు అబద్ధం మాట్లాడితే తపస్సు సంపూర్ణం కాదు. మాటలు మధురంగా ఉన్నా.. మనస్సులో ద్వేషం ఉంటే అది కూడా సంపూర్ణత కాదు. మనసు, మాట, కర్మ ఈ మూడూ ఒకే ధర్మబాటలో నడిచినప్పుడే త్రికరణ శుద్ధి సిద్ధిస్తుందని భగవానుడు చెబుతున్నారు.

తపస్సు అంటే అడవుల్లోకి వెళ్లి కఠోర దీక్షలు చేయడం మాత్రమే కాదు.. మనిషి ప్రతిరోజూ తన జీవన విధానాన్ని పవిత్రంగా మలచుకోవడమే అసలైన తపస్సు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు.. అలాగే శ్రద్ధాత్రయ విభాగ యోగంలోని 14, 15, 16వ శ్లోకాలలో కృష్ణ పరమాత్మ తపస్సును మూడు స్థాయిలుగా వివరించాడు.

అవే కాయిక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు. ఈ మూడు కలిసినప్పుడే మనిషిలో త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది. ఇక మొదటిది కాయిక తపస్సు. మన శరీరంతో చేసే ప్రతి కర్మను పవిత్రంగా మార్చుకోవడం. దేవతలు, గురువులు, జ్ఞానులు, పెద్దలను గౌరవించడం.. శరీరం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం.. ప్రవర్తనలో సరళత్వం, ఇంద్రియ నిగ్రహం, అహింసను పాటించడం. అంటే మన చేతుల ద్వారా ఇతరులకు బాధ కలుగకుండా..సేవ, గౌరవం, ధర్మం పాటించాలి..

రెండవది వాచిక తపస్సు. మనిషి నోటి నుంచి వచ్చే ఒక్క మాట కూడా ఒక కర్మే. అందుకే మాట సత్యంగా, ప్రియంగా, హితంగా ఉండాలని కృష్ణుడు చెబుతాడు. నిజం మాట్లాడటం మాత్రమే సరిపోదు.. ఆ నిజం ఎదుటివారి హృదయాన్ని గాయపరచకుండా చెప్పగలగడమే వాచిక తపస్సు. పవిత్ర గ్రంథాల అధ్యయనం, భగవన్నామ స్మరణ కూడా ఇందులో భాగమే..

మూడవది మానసిక తపస్సు. ఇదే అత్యంత లోతైన సాధన. బయట ప్రపంచాన్ని జయించే ముందు మనలోని కోపాన్ని, ఈర్ష్యను, ద్వేషాన్ని, అహంకారాన్ని జయించాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచడం, అందరి పట్ల సౌమ్యభావం కలిగి ఉండటం, వ్యర్థ ఆలోచనలను నియంత్రించడం, భావాలను పవిత్రంగా ఉంచుకోవడమే మానసిక తపస్సు.

ఇక్కడ ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం దాగి ఉంది. చేతులు ధర్మం చేస్తూ.. నోరు అబద్ధం మాట్లాడితే తపస్సు సంపూర్ణం కాదు. మాటలు మధురంగా ఉన్నా.. మనస్సులో ద్వేషం ఉంటే అది కూడా సంపూర్ణత కాదు. మనసు, మాట, కర్మ ఈ మూడూ ఒకే ధర్మబాటలో నడిచినప్పుడే త్రికరణ శుద్ధి సిద్ధిస్తుందని భగవానుడు చెబుతున్నారు.

అందుకే శ్రీకృష్ణుడు చూపించిన తపస్సు కేవలం ఒక ఆచారం కాదు.. అది మనిషిని లోపల నుంచి మార్చే ఆధ్యాత్మిక శాస్త్రం. శరీరంతో సేవ.. మాటతో సత్యం.. మనసుతో శాంతి.. ఈ మూడింటినీ సాధనగా మార్చుకున్నప్పుడు, మనిషి బయట ప్రపంచాన్ని మార్చకపోయినా.. తన అంతరంగ ప్రపంచాన్నే దైవస్వరూపంగా మార్చుకోగలడు..

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.

#Spirituality#Indian Culture#purity thought#word#deed possible#secret#Bhagavad Gita
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి