ఉభయ సభలు.. 19 సమావేశాలు
25 రోజుల వ్యవధి.. 12 బిల్లులు ఆమోదం
బిల్లులపై చర్చించిందెంత...?
3-4 నిమిషాల్లోనే బిల్లులను పాస్ చేస్తారా..?
దేశ చట్టాలను రూపొందించే అత్యున్నత వేదిక పార్లమెంట్. అక్కడ ప్రతి బిల్లుపైనా చర్చ జరగాలి.. అధికార పక్షం తన వాదన చెప్పాలి.. ప్రతిపక్షం ప్రశ్నించాలి.. లోపాలను ఎత్తిచూపాలి.. అవసరమైతే సవరణలు సూచించాలి. చివరికి దేశానికి ఉపయోగపడే చట్టం రావాలి. కానీ తాజాగా ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తీరు చూస్తే.. బిల్లులు పాస్ అయ్యాయా.. అంటే అయ్యాయి? అవును. కానీ వాటిపై తగినంత చర్చ జరిగిందా? ఇప్పుడు ఇదే అతిపెద్ద ప్రశ్న.
జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు జరిగిన ఈ సమావేశాలు మొత్తం 25 రోజుల పాటు కొనసాగాయి. 19 సిట్టింగ్స్ జరిగాయి. ఈ టైమ్‌లో పార్లమెంట్‌లో శాసనపరమైన పని కూడా జరిగింది. రెండు సభల్లో కలిపి 12 బిల్లులు ఆమోదం పొందినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. అయితే ఆ సంఖ్యను మాత్రమే చూసి పార్లమెంట్ బాగా పనిచేసిందని చెప్పడం కష్టం. ఎందుకంటే అసలు కథ బిల్లుల సంఖ్యలో కాదు.. వాటిపై జరిగిన చర్చలో ఉంది.
ఈ సమావేశాల్లో లోక్‌సభ ఉత్పాదకత కేవలం 19 శాతంగా, రాజ్యసభ ఉత్పాదకత సుమారు 39 శాతంగా నమోదైంది. పదేపదే వాయిదాలు, నిరసనలు, నినాదాలతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. అంటే 25 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరిగినా.. ప్రజలు ఆశించిన స్థాయిలో చట్టసభ పని జరగలేదన్న మాట.
బిల్లులపై చర్చ ఎక్కడ..?
ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. బిల్లు అంటే కొన్ని పేజీల కాగితం కాదు. అది కోట్లాది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే చట్టం కావచ్చు. పన్నులు కావచ్చు.. విద్య కావచ్చు.. పరీక్షా విధానం కావచ్చు.. వ్యాపారాలు కావచ్చు.. ప్రభుత్వ వ్యవస్థ కావచ్చు. అలాంటి బిల్లును సభ ముందుకు తీసుకొచ్చినప్పుడు ఎంపీలు దానిని చదివి, దాని ప్రభావాలను విశ్లేషించి, ప్రజల తరఫున ప్రశ్నించాల్సి ఉంటుంది.
కానీ ఈసారి కొన్ని బిల్లులు సభలోకి వచ్చిన వేగంతోనే ఆమోదం పొందాయన్న విమర్శలు వచ్చాయి. కొన్ని బిల్లులపై మూడు, నాలుగు నిమిషాల చర్చ కూడా జరగలేదన్న స్థాయిలో పరిస్థితి కనిపించింది. కొన్ని సందర్భాల్లో అసలు చర్చ మొదలయ్యే పరిస్థితి కూడా లేకుండా హంగామా మధ్యే ప్రక్రియ ముందుకు వెళ్లింది.
ఇక్కడ అధికార పక్షాన్ని మాత్రమే ప్రశ్నించడం సరిపోదు. ప్రతిపక్షాన్నీ ప్రశ్నించాల్సిందే. ప్రభుత్వం బిల్లులు తీసుకురావడం దాని బాధ్యత అయితే.. వాటిని ప్రశ్నించడం, లోపాలను బయటపెట్టడం, ప్రత్యామ్నాయాలను సూచించడం ప్రతిపక్ష బాధ్యత. కానీ సభలో నిరసనల పేరుతో చర్చే జరగకుండా పోతే.. చివరికి నష్టం ఎవరికి? ప్రభుత్వానికా? ప్రతిపక్షానికా? కాదు.. నష్టం ప్రజాస్వామ్యానికి.
ప్రభుత్వానికి బాధ్యత లేదా..?
ఇదే సమయంలో ప్రభుత్వం కూడా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మాకు మెజారిటీ ఉంది కాబట్టి బిల్లు పాస్ చేయగలం అనేది చట్టపరంగా సాధ్యమే కావచ్చు. కానీ చర్చ అవసరం లేదు అనే భావన మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తికి సరిపోతుందా? మెజారిటీ అనేది బిల్లును గెలిపించే సంఖ్య. కానీ చర్చ అనేది ఆ బిల్లుకు ప్రాణం పోసే ప్రక్రియ.
ఇంకో ముఖ్యమైన అంశం ప్రశ్నోత్తరాల సమయం. ఎంపీలు ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి పార్లమెంట్‌లో ప్రశ్నలు అడుగుతారు. ప్రభుత్వ శాఖలు సమాధానాలు ఇవ్వాలి. ఈ ప్రక్రియ ద్వారా ప్రజలకు తెలియని సమాచారం బయటకు వస్తుంది. కానీ సభ తరచూ వాయిదా పడితే.. నినాదాలతో సమయం గడిచిపోతే.. ఆ ప్రశ్నలు ఎక్కడికి పోతాయి? ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన వేదికలోనే ప్రశ్నలు మిగిలిపోతే.. ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి? ఇన్ని రోజుల సమావేశాల్లో లోక్‌సభలో రెండంటే రెండే ప్రశ్నలు.. క్వశ్చన్ అవర్‌లో అడిగారట. ఇదీ పరిస్థితి.
ఇక్కడ మరో విరుద్ధ పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ప్రభుత్వమేమో.. ప్రతిపక్షం సభను నడవనివ్వడం లేదు అంటోంది. మరోవైపు ప్రతిపక్షం “మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు.. కీలక అంశాలపై చర్చ జరగడం లేదు” అంటోంది. రెండు వైపులా ఆరోపణలు ఉన్నాయి. కానీ మధ్యలో ఉన్న ప్రజలకు మాత్రం ఒకే ప్రశ్న — మరి మా సమస్యలపై చర్చ ఎప్పుడు?
ఈ సమావేశాల్లో తీవ్ర రాజకీయ విభేదాలు కనిపించాయి. నిరసనలు, వాయిదాలు, నినాదాలు సభా కార్యక్రమాలను ప్రభావితం చేశాయి. ఫలితంగా బిల్లులు ఆమోదం పొందినా.. వాటిపై జరిగే సమగ్ర చర్చకు అవసరమైన సమయం తగ్గిపోయింది. FCRA సవరణ బిల్లు వంటి కొన్ని కీలక అంశాలు మాత్రం జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు వెళ్లాయి.
ఇదే నిజానికి ప్రజాస్వామ్యానికి ఒక హెచ్చరిక. పార్లమెంట్ అంటే కేవలం బిల్లులు పాస్ చేసే యంత్రం కాదు. అది ప్రశ్నించే వేదిక. వాదించే వేదిక. ప్రభుత్వం తన నిర్ణయాలను సమర్థించుకునే వేదిక. ప్రతిపక్షం వాటిని పరీక్షించే వేదిక.
ఒక బిల్లుపై మూడు నిమిషాలు చర్చ జరిగిందా? ఐదు నిమిషాలు జరిగిందా? అనే దానికంటే కూడా.. ఆ చర్చలో అసలు విషయాలు బయటపడ్డాయా? ప్రజల సందేహాలకు సమాధానాలు వచ్చాయా? బిల్లులోని లోపాలు పరిశీలించబడ్డాయా? నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నారా? కమిటీకి పంపాల్సిన అవసరం ఉందా? అన్నదే ముఖ్యం.
అందుకే ఈ సమావేశాలు ముగిసిన తర్వాత మిగిలిన అసలు ప్రశ్న ఎన్ని బిల్లులు పాస్ అయ్యాయి?” కాదు. ఎన్ని బిల్లులపై అర్థవంతమైన చర్చ జరిగింది అనేదే. ప్రజాస్వామ్యంలో నెంబర్లు ముఖ్యమే. కానీ దానికంటే ముందు.. సమాధానాలు చాలా ముఖ్యం. మెజారిటీ ముఖ్యం. కానీ దానికంటే ముందు బాధ్యత ముఖ్యం. బిల్లు పాస్ కావడం ముఖ్యం. కానీ దానికంటే ముందు ఆ బిల్లు ఎందుకు అవసరమో ప్రజలకు అర్థమయ్యేలా చర్చ జరగడం మరింత ముఖ్యం.
ఈ ప్రశ్నలకు బదులేది..?
పార్లమెంట్ తలుపులు మళ్లీ తెరుచుకునే వరకు ఈ ప్రశ్నలు అలాగే ఉంటాయి. సభ నడిచిందా? లేక కేవలం సమావేశమైందా? బిల్లులు పాస్ అయ్యాయా? లేక చర్చను దాటుకుని పాస్ అయ్యాయా? అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరినీ వేధిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా.. దేశ ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? అందుకే.. పార్లమెంట్ ముగిసింది.. కానీ ప్రశ్నలు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి.


