నల్లని రహదారులు.. నిత్యం రక్తసిక్తమవుతున్నాయి! వాహనదారుల చిన్నపాటి నిర్లక్ష్యం.. ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. అతివేగం, అజాగ్రత్త డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన వంటి కారణాలు ఏవైనా.. ప్రమాదం జరిగితే మాత్రం ప్రాణాలు పోతున్నాయి. మరోవైపు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. నిర్లక్ష్యానికి అడ్డుకట్ట పడటం లేదు. ఒక్క క్షణం తొందర పాటు ఓ కుటుంబాన్నే రోడ్డున పడేస్తోంది.
ఇందుకు ఉదాహరణగా నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. ఇక తాజాగా హైదరాబాద్–శ్రీశైలం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ వద్ద రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై నుంచి కిందపడిన శివయాదవ్‌ను.. వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. తీవ్ర గాయాలతో శివయాదవ్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు తాండ్రకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
అయితే.. ఈ ప్రమాదం కేవలం ఒక వ్యక్తి ప్రాణాలను బలిగొన్న ఘటనగానే చూడలేం. రహదారిపై వేగం, అప్రమత్తత లోపం, వాహనాల మధ్య తగినంత దూరం పాటించకపోవడం.. ప్రమాదం జరిగిన తర్వాత పరిస్థితిని మరింత విషాదంగా మార్చే అంశాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా హైవేలపై ద్విచక్ర వాహనదారులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎదురుగా వస్తున్న వాహనాలను గమనించడంతో పాటు.. వెనక నుంచి వచ్చే వాహనాల వేగాన్ని కూడా అంచనా వేయాలి.
అదే సమయంలో కార్లు, ఇతర వాహనాల డ్రైవర్లు కూడా వేగాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేదంటే ముందున్న చిన్న అడ్డంకిని గుర్తించేలోపే వేగంగా వస్తున్న వాహనం అదుపుతప్పితే.. క్షణాల్లో ప్రాణాంతకంగా మారుతుంది. ఇక చేయవలసిన పనికంటే ప్రాణాలు ముఖ్యమని వాహన చోదకులు మరచిపోతుండటం బాధాకరం.. చేరవలసిన గమ్యాన్ని కాస్త ఆలస్యంగా అయిన చేరవచ్చు.. కానీ ఊపిరి ఆగిపోయిన, అంగవైకల్యం సంభవించిన ఆ నష్టం ఎవరు పూడ్చలేనిది..
ఇదిలా ఉండగా.. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి అసలు కారణం ఏంటి? రెండు బైక్‌లు ఎలా ఢీకొన్నాయి? కారు ఎంత వేగంతో వచ్చింది? డ్రైవర్ నిర్లక్ష్యం ఏమైనా ఉందా? వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. ఇక ఒక్క క్షణం నిర్లక్ష్యం.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. రహదారిపై వేగం కంటే.. ప్రాణం విలువైనదని ప్రతి వాహనదారుడు గుర్తించాల్సిన అవసరం ఉందని ఇలాంటి సంఘటనలు నిరూపిస్తున్నాయి..


