Eagle Force: హైదరాబాద్ వ్యాప్తంగా ఈగల్ టీమ్ ఆపరేషన్ నిర్వహించింది. డ్రగ్స్ పెడ్లర్స్, వినియోగదారులపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. 30 మందికిపైగా డ్రగ్ పెడ్లర్స్ ను (సరఫరాదారులు) ఈగల్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. సుమారు 100 మంది డ్రగ్స్ వినియోగదారులను గుర్తించింది. ఇక, బాలానగర్ పరిధి వినాయక్ నగర్ లో పాత నేరస్తుడు కిరణ్ ఇంట్లో డ్రగ్స్ గుర్తించారు ఈగల్ టీమ్ అధికారులు. సుమారు 25 కిలోల గంజాయి, 2 లీటర్ల హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులతో ఎస్ఐ, ఐదుగురు కానిస్టేబుళ్లకు లింకులు ఉన్నట్లు సమాచారం.
ప్రత్యేక డ్రైవ్ కు సంబంధించి ఈగల్ ఫోర్స్ డీఎస్పీ నర్సింగ్ రావు వివరాలు వెల్లడించారు. కిరణ్ ఇంట్లో సోదాల కోసం వెళ్లిన సమయంలో తమపైకి కుక్కలను వదిలారని చెప్పారు. ఆ కుక్కలు చూడటానికే భయంకరంగా ఉన్నాయన్నారు. ఒక వ్యక్తి నాలుగో అంతస్తు పైనుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడని తెలిపారు. తమ ఇన్ స్పెక్టర్ పై కత్తితో దాడి చేశారని, ఈ దాడిలో చేతికి గాయమైందని వెల్లడించారు.
ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే గంజాయి దందా చేస్తున్నారని డీఎస్పీ తెలిపారు. ఒడిశా నుంచి పెద్దఎత్తున గంజాయి ఇక్కడికి తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి అమ్ముతున్నారని వెల్లడించారు. వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి పేమెంట్ చేసిన వారికి లొకేషన్ అడిగి నేరుగా పంపుతున్నారని పేర్కొన్నారు. 14.5 కిలోల గంజాయితో పాటు ఒక ఎయిర్ గన్ కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. దుర్గాప్రసాద్, కమలాకర్, కిరణ్ తోపాటు కిరణ్ భార్యను అదుపులోకి తీసుకున్నామని ఈగల్ ఫోర్స్ డీఎస్పీ నర్సింగ్ రావు తెలిపారు.


