Cm Revanth Reddy: హిందూ, ముస్లింలు కాంగ్రెస్ కు రెండు కళ్ల లాంటి వాళ్లు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నిజమైన సెక్యులర్ పార్టీ అన్న ముఖ్యమంత్రి రేవంత్.. మైనారిటీలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సోనియా గాంధీ నేతృత్వంలో మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ కృషి చేసిందన్నారు. మైనారిటీలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ దేనని చెప్పారు.
అయితే, ముస్లింల రిజర్వేషన్ల రద్దుకు కొన్ని పార్టీలు ప్రయత్నాలు చేశాయని ఆయన ఆరోపించారు. అయినా చిత్తశుద్ధితో రిజర్వేషన్లు కల్పించామన్నారు. మైనార్టీ రిజర్వేషన్లను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యతిరేకించారని రేవంత్ చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు తొలగిస్తామని అమిత్ షా అన్నారన్న రేవంత్.. ముందుగా గుజరాత్ లో రిజర్వేషన్లు తొలగించి ఆ తర్వాతే అమిత్ షా మాట్లాడాలని సవాల్ విసిరారు.
''ఫిరోజ్ ఖాన్, షబ్బీర్ అలీ, అజారుద్దీన్ కు టికెట్ ఇచ్చినా మీరు గెలిపించలేదు. అయినా అజారుద్దీన్ ను మంత్రిని చేశాం. నిబంధనలను పక్కన పెట్టి నిఖత్ జరీన్ కు గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చాం. క్రికెటర్ సిరాజ్ కు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చాం. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ముస్లింలకు మేలు చేశాం'' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ కొమురం భీమ్ ఆదివాసీ భవన్ లో మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతిభ చూపిన మైనార్టీలకు పురస్కారాలు అందించారు.












