టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతుందో.. సైబర్ నేరాలు చేసే వాళ్ళు కూడా అంతే ఫాస్ట్ గా కొత్త కొత్త మార్గాలలో మోసాలు చేయడానికి సిద్ధం అవుతున్నారు.. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఖాతాలు, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత వివరాలను దొంగిలించి మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే తెలియని లింకులు క్లిక్ చేయడం, అనుమానాస్పద యాప్‌లు డౌన్‌లోడ్ చేయడం, ఓటీపీ లేదా బ్యాంకింగ్ వివరాలు ఇతరులతో పంచుకోవడం అస్సలు చేయకూడదని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇక ఈ మధ్య కాలంలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను చేపట్టిన విషయం తెలిసిందే.. ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులను సరిచేయడం, మరణించిన వారి పేర్లను తొలగించడం, డూప్లికేట్ ఓట్లను గుర్తించడం, అర్హులైన కొత్త ఓటర్ల పేర్లను చేర్చడం ఈ సవరణ ప్రధాన ఉద్దేశం.. అయితే సైబర్ మోసగాళ్ళు ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు..
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పేరుతో ఓటర్లకు మోసపూరిత ఎస్సెమ్మెస్‌లు, కాల్స్ పంపిస్తున్నారని సమాచారం.. వాట్సప్ ద్వారా పంపించే లింక్ ఓపెన్ చేసి ఫారం నింపాలంటూ సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో.. ఇలాంటి కాల్స్, మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ప్రజలకు సూచించారు.
మరోవైపు ఎన్యుమరేషన్ ఫారం లేదా ఎన్నికల గుర్తింపు కార్డు రిజెక్ట్ అయినట్లు కొందరికి మోసగాళ్ళు నకిలీ మెసేజ్‌లు పంపుతున్నారు. ఫారంలో వివరాలు తప్పుగా ఉన్నాయని, వాట్సాప్‌లో పంపిన లింక్ ద్వారా మళ్లీ ఫారం పూర్తి చేయాలని సూచిస్తున్నారు. అనంతరం నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా రూ.5 చెల్లించాలంటూ మోసానికి పాల్పడుతున్నారు.
ఈ క్రమంలో లాగిన్ వివరాలు, పాస్‌వర్డ్, సీవీవీ, ఏటీఎం పిన్, బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇలాంటి మోసపూరిత కాల్స్, మెసేజ్‌ల పట్ల ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఎన్నికల సంఘం పేరుతో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు.
అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్‌లు వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే ఎన్నికల సంఘం నుంచి ఓటర్లకు ఎలాంటి ఎస్సెమ్మెస్‌లు రావని.. ఈసీఐ, సీఈవో పేరుతో వచ్చే మెసేజ్‌లు, కాల్స్‌కు స్పందించవద్దని.. అలాంటి కాల్స్, మెసేజ్‌లు వస్తే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు..












