Thief Asleep: కొందరు దొంగలు చేసే పనులు చిత్రవిచిత్రంగా ఉంటాయి. చోరీలకు వెళ్లిన సమయంలో వారు చేసే విన్యాసాలు విస్తుపోయేలా చేస్తాయి. కొన్ని సందర్భాల్లో నవ్వులు పూయిస్తాయి. చోరీకి వెళ్లిన ఇంట్లోనే తినడం, తాగడం చేస్తుంటారు. మరికొందరు ఎంచక్కా బెడ్ రూమ్ లోకి వెళ్లి పడక మీద హాయిగా నిద్రపోవడమూ చూశాం. తాజాగా అలాంటి విచిత్రమైన ఘటన ఒకటి హైదరాబాద్ పాతబస్తీలో చోటు చేసుకుంది. దొంగతనం చేసేందుకు ఇంట్లోకి దూరిన దొంగ.. ఆ ఇంట్లోనే గురక పెట్టి మరీ నిద్రపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఓ యువకుడు చోరీ చేసేందుకు తాళం వేసిన ఇంట్లోకి చొరబడ్డాడు. బీరువాలో ఉంచిన బంగారం తీసుకుని ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. ఇక మరో గదిలో ఉంచి సెల్ ఫోన్ ను కూడా జేబులో వేసుకున్నాడు. అయితే, అతడు మద్యం మత్తులో ఉన్నాడు. కిక్కు బాగా ఎక్కేసిందో ఏమో కానీ.. చోరీ చేసిన తర్వాత అతడికి బాగా నిద్ర వచ్చింది. అంతే దొంగతనానికి వెళ్లిన అదే ఇంట్లోని బెడ్ రూమ్ లోకి వెళ్లి నిద్రపోయాడు. ఎంతలా అంటే.. గురక పెట్టి మరీ పడుకున్నాడు.
మరుసటి రోజు ఇంటి యజమాని వచ్చి చూడగా షాక్ అయ్యాడు. బెడ్ రూమ్ లో ఆదమరిచి నిద్రపోతున్న దొంగను చూసి కంగుతిన్నాడు.
గుర్రు పెట్టి మరీ నిద్రపోతున్న దొంగను వీడియో తీశాడు యజమాని. అతడి జేబులో ఉన్న బంగారు ఆభరణాలను కూడా వీడియో తీశాడు. తర్వాత దొంగను పోలీసులకు అప్పగించాడు. చోరీకి వెళ్లిన ఇంట్లోనే దొంగ ఆదమరిచి నిద్రపోయిన వైనం స్థానికులను విస్తుపోయేలా చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోష్ మీడియాలో వైరల్ గా మారింది. వీడెవడండీ బాబూ అని నెటిజన్లు నవ్వుకుంటున్నారు.


