హైదరాబాద్ సమీపంలోని ఫ్యూచర్ సిటీలో టెస్సరాక్ట్ (Tesseract) సంస్థకు సేకరించిన భూముల కేటాయింపు ప్రక్రియపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ అనవసర రాజకీయం చేస్తోందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. న్యూఢిల్లీలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పారదర్శకమైన పాలన అందిస్తోందని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు నిబంధనలకు కట్టుబడి మాత్రమే భూ కేటాయింపులు జరుపుతోందని ఆయన స్పష్టం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోల్చుతూ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పక్కా గణాంకాలతో ఆరోపణలను తిప్పికొట్టారు. గత బీఆర్‌ఎస్ పాలనలోని ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (EMC) పరిధిలో 54 కంపెనీలకు ఎకరం కేవలం రూ.30లక్షల నుంచి రూ.80లక్షల చొప్పున మాత్రమే కట్టబెట్టారని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తూ 8 కంపెనీలకు భూ కేటాయింపులు జరిపిందని, ఎకరాకు గరిష్ఠంగా రూ.1.50కోట్ల చొప్పున ఆదాయం రాబట్టిందని వివరించారు. ఇక వివాదాస్పదంగా మారుస్తున్న టెస్సరాక్ట్ సంస్థ 5 ఎకరాల భూమి కోసం 2024లోనే నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకుందని, ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని స్పష్టం చేశారు.
ప్రభుత్వంపై లేనిపోని బురద చల్లేందుకు బీఆర్ఎస్ నాయకులు యత్నిస్తున్నారని, వారి ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఖండించారు.గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన కేటాయింపులపై చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. నాడు కేటీఆర్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తన అనుచరులకు, సొంత స్నేహితుల కంపెనీలకు ఏ విధంగా ప్రభుత్వ విలువైన భూములను కట్టబెట్టారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. నాడు తాము చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే నేడు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని ఆక్షేపించారు.
మాజీ మంత్రి కేటీఆర్ ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును దెబ్బతీయడంతో పాటు పారిశ్రామికవేత్తలను భయపెట్టేందుకు బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఇలాంటి అర్థం లేని విమర్శలు చేయడం వెంటనే మానుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు.












