Sukhbir Singh Badal: పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, అకాలీదళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై దాడి జరిగింది. దుండగుడు పదునైన ఆయుధంతో బాదల్ పై దాడికి తెగబడ్డాడు. మహారాష్ట్రలోని నాందేడ్ లో ఈ ఘటన జరిగింది. సుఖ్ బీర్ సింగ్ బాదల్ మాతా సాహిబ్ గురుద్వార దర్శనానికి వెళ్లారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బాదల్ పై అటాక్ చేశాడు. ఈ దాడిలో బాదల్ చేతికి గాయాలయ్యాయి. దుండగుడిని అడ్డుకునే ప్రయత్నంలో భద్రతా సిబ్బందికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మాజీ డిప్యూటీ సీఎంపై దాడి తీవ్ర కలకలం రేపింది. ఆ దుండగుడు ఎవరు? ఎందుకు దాడి చేశాడు? అతడి ఉద్దేశ్యం ఏంటి? అనేది తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. దాడికి పాల్పడ వ్యక్తిని నిహంగ్ సిక్కుగా పోలీసులు గుర్తించారు. బాదల్ ను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి జరిగిన సమయంలో బాదల్ భార్య, అకాలీ దళ్ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ఆయనతోనే ఉన్నారు. సుఖ్ బీర్ సింగ్ బాదల్ అంతకుముందు రోజు తన కుటుంబంతో కలిసి నాందేడ్‌లోని తక్త్ శ్రీ హజూర్ సాహిబ్‌ను సందర్శించారు.
దుండగుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ పొట్టలో పొడవడానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సుఖ్‌బీర్ బాదల్ చేతికి గాయమైందని, అయితే అది ప్రాణాంతకం కాదని అకాలీ దళ్ వర్గాలు తెలిపాయి. ఆయనకు నాందేడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందుతోందన్నారు. బాదల్ చేతికి డాక్టర్లు కుట్లు వేశారు.
పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై గతంలో హత్యాయత్నం జరిగింది. 2024 డిసెంబర్ 4న అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం వెలుపల జరిగిన హత్యాయత్నం నుండి ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. అప్పుడు ఆయనకు ఎలాంటి హాని జరగలేదు. దాడికి పాల్పడ్డ దుండగుడిని వెంటనే అరెస్ట్ చేశారు.
2007 నుండి 2017 వరకు పంజాబ్‌లో పార్టీ పాలనలో చేసిన "తప్పుల"కు గాను, బాదల్‌తో పాటు పలువురు ఇతర అకాలీ దళ్ నాయకులకు అకల్ తఖ్త్ 'తంఖా' (మతపరమైన శిక్ష) విధించిన తరువాత, ఆయన స్వర్ణ దేవాలయంలో 'సేవాదార్' విధులు నిర్వర్తిస్తుండగా ఆయనపై దాడి జరిగింది.


