Pensions: పెన్షన్లకు సంబంధించి మంత్రి సీతక్క మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. వితంతు, ఒంటరి మహిళల పెన్షన్ల పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16న ప్రారంభిస్తారని మంత్రి సీతక్క తెలిపారు. 16వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్ లో మంత్రులతో కలిసి సీఎం రేవంత్ మేడారం చేరుకుంటారని చెప్పారు.
''సీఎం రేవంత్ రెడ్డి 16వ తేదీన మేడారం వచ్చి సమ్మక్క, సారలమ్మను దర్శించుకుంటారు. రాష్ట్రంలోని ఒంటరి, వితంతు మహిళలకు పెన్షన్ పథకాన్ని సమ్మక్క, సారలమ్మ సన్నిధి నుంచి ప్రారంభిస్తారు. అనంతరం ములుగు డిగ్రీ కాలేజీకి వెళ్తారు. 16వేల కోట్ల రూపాయలతో చేపట్టిన హ్యామ్ రోడ్ల పైలాన్ ను ఆవిష్కరిస్తారు. నూతన కలెక్టరేట్ ను ప్రారంభిస్తారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తారు.
అనంతరం ప్రజలను, అభిమానులను ఉద్దేశించి మాట్లాడతారు. మధ్యాహ్నం 3, 3.30 గంటలకు పరకాల వెళ్తారు. పరకాలలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఉంటుంది. అక్కడ మహిళల కోసం నిర్మించిన డైరీ ఫామ్ ను ప్రారంభిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు, ప్రజలు, అభిమానులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం'' అని సీఎం రేవంత్ పర్యటన వివరాలను మంత్రి సీతక్క తెలియజేశారు.
గురువారం మేడారంలో మంత్రి సీతక్క పర్యటించారు. వనదేవతల సన్నిధిలో అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి సీతక్క పరిశీలించారు. మేడారం ఆలయ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులతో చెప్పారు. 16న మధ్యాహ్నం సమ్మక్క, సారలమ్మను సీఎం దర్శించుకుంటారని.. మేడారం సన్నిధి నుంచే ఒంటరి, వితంతు మహిళల పెన్షన్ల పథకాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. పెన్షన్ల కోసం ఆగస్టు 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. ఇక పంచాయతీ రాజ్ శాఖ పైలాన్, ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్ ను సీఎం రేవంత్ ప్రారంభిస్తారని మంత్రి సీతక్క పేర్కొన్నారు.


