తెలంగాణ ప్రభుత్వం ఇటీవల యాదాద్రి దేవాలయ ట్రస్టు బోర్డును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో రాష్ట్రంలో యాదాద్రి వెలుగొందాలని, పారదర్శకంగా ఆలయంలో నిధులు ఖర్చు, వివరాలు, ఆదాయం పెంపుకోసం దీనిని ఏర్పాటు చేసినట్టు సీఎం పేర్కొన్నారు. అయితే, ఇటీవల ఏర్పాటు చేసిన బోర్డు ట్రస్టు ఏర్పాటుపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. బోర్డులో రాజకీయనేతలకు అవకాశం కల్పించడాన్ని న్యాయస్థానంలో సవాల్ చేశారు.
దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం, బోర్డ్ చైర్మన్ సభ్యులకు హైకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. అయితే, యాదాద్రి దేవాలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 392ను సవాల్ చేస్తూ నాగిళ్ల శ్రీనివాస్, వ్యవస్థాపక ట్రస్టీ భాస్కరయాని నరసింహమూర్తి అనే ఇద్దరు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రాజ్యాంగంలోని 24, 25 సవరణల ప్రకారం ఆలయ బోర్డులో ప్రజాప్రతినిధులకు అవకాశం ఇవ్వకూడదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, దేవాదాయ శాఖ, ఆలయ ఈవో, చైర్మన్, యాదాద్రి జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రధాన అర్చకులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఇదిలాఉండగా, యాదాద్రి ఆలయ ట్రస్టు ఏర్పాటుపై అధికార పార్టీలోనూ పలువురు పెదవి విరిస్తున్నారు.
తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా బోర్డు ఏర్పాటు చేయడంపై అసంతృప్తి వెల్లగక్కుతున్నారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సైతం బోర్డు ఏర్పాటుపై తమను ఒకసారి సంప్రదిస్తే బాగుండేదని ఇటీవల కామెంట్ చేశారు.












