ఏపీలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల బాగోగుల కోసం పాఠశాలల్లోనే ‘సిక్’ రూమ్స్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. సాధారణంగా వాతావరణంలో మార్పుల కారణంగా పిల్లలు జబ్బు పడుతుంటారు. అలాంటి వారిని ఇంటికి పంపించకుండా స్కూల్లోనే ఏర్పాటు చేసిన సిక్ రూమ్స్‌లో విశ్రాంతి కల్పిస్తారు. అలా చేయడం వలన విద్యార్థులు కాస్త సెట్ అయ్యాక మళ్లీ తరగతి గదిలోకి వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. వారికి అవసరమైన ప్రాథమిక వైద్యం కూడా అందించనున్నారని సమాచారం.
విద్యార్థులు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనా లేదా ప్రమాదవశాత్తూ గాయపడినా తక్షణ ప్రథమ చికిత్స అందించి వారికి రెస్ట్ ఇస్తారు. అందుకోసమే ఏపీలోని 629 పీఎం శ్రీ పాఠశాలల్లో ‘సిక్ రూమ్‌లు’ ఏర్పాటు చేస్తున్నది. ఒక్కో పాఠశాలకు రూ. 5 లక్షల చొప్పున, మొత్తం సుమారు రూ. 30 కోట్ల వ్యయంతో ఈ గదులను కూటమి సర్కార్ ఆదేశాలతో అధికారులు తీర్చిదిద్దుతున్నారు.పాఠశాల విద్యాశాఖను ఇందులో ఇన్వాల్వ్ చేశారు. పాఠశాలలో ఒక గదిని కేటాయించి ఆస్పత్రి తరహా బెడ్లు, ప్రథమ చికిత్స మందులు, ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులో ఉంచుతారు.
విద్యార్థులకు వైద్యం అందించేందుకు స్థానిక ఏఎన్‌ఎం సేవలను వినియోగించుకోవాలని విద్యాశాఖను సర్కారు ఆదేశించినట్టు తెలిసింది. ఏఎన్ఎంలు విద్యార్థులకు తక్షణ వైద్య సాయం అందించనున్నారు. ప్పటికే సిక్ రూమ్‌లకు కావలసిన సామగ్రి పాఠశాలలకు చేరుకోగా, మరో నెల రోజుల్లో వీటిని విద్యార్థులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకరావడానికి సమగ్ర శిక్ష అధికారులు చర్యలు వేగవంతం చేశారు. అయితే, కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












