CJP: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)ని రాజకీయ పార్టీగా మార్చే అంశంపై ఆ పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే స్పందించారు. కీలక ప్రకటన చేశారు. కాక్రోచ్ పార్టీని పొలిటికల్ పార్టీగా మార్చే యోచన ప్రస్తుతానికి లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రెజర్ గ్రూప్ గానే పని చేస్తామని వెల్లడించారు. దేశంలోని యువత ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటమే తమ పంథా అని తెలిపారు. ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేస్తామన్నారు. దేశంలో స్టూడెంట్స్ ఎక్కడ ఉద్యమం చేసినా అండగా ఉంటామని వెల్లడించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో CJP రెండు రోజుల వ్యూహ రచన సమావేశంలో భాగంగా అభిజీత్ దీప్కే మీడియాతో మాట్లాడారు. సీజేపీని జాతీయ స్థాయికి విస్తరించడం, జార్ఖండ్‌లో జరుగుతున్న విద్యార్థుల నిరసనల్లో పాల్గొనడం గురించి ఆయన సంకేతాలు ఇచ్చారు.
కేవలం రెండు నెలల క్రితం వ్యంగ్య వేదికగా 'CJP'ని ప్రారంభించిన 30 ఏళ్ల దీప్కే, రాజకీయ పార్టీని స్థాపించే ఉద్దేశం ఏదీ లేదని తేల్చి చెప్పారు. మొదట్లో దీనిని కేవలం ఒక ఆన్‌లైన్ సంచలనంగా కొట్టిపారేసినప్పటికీ, దీప్కే నాయకత్వంలోని CJP పోటీ పరీక్షల ప్రశ్నా పత్రాల లీకేజీకి వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల నిరసనలకు ప్రధాన సారథ్యం వహించింది. జూలై 20న హింసాత్మక ఘటనలకు దారితీసిన ఈ నిరసనలు, చివరికి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీశాయి. ఆ తర్వాత నుండి నిరుద్యోగం, విద్యా వ్యవస్థలోని అక్రమాల పట్ల అసహనంతో ఉన్న లక్షలాది మంది యువతకు సీజేపీ ఒక ప్రధాన వాయిస్ గా మారింది.
"ప్రస్తుతానికి రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశం ఏదీ లేదు. రాజకీయ పార్టీని స్థాపన గురించి ఆలోచన చేయడం లేదు. మాకంటే.. మీడియాకే దానిపై ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు కనిపిస్తోంది. మేము ఒక ఒత్తిడి సమూహంగా (pressure group) పని చేస్తాము. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా మొదలైన ఉద్యమాన్ని విస్తరించేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించడమే ఈ వ్యూహాత్మక సమావేశం లక్ష్యం. దేశవ్యాప్తంగా ఉన్న యువతతో మమేకమయ్యేందుకు ఒక 'లిజనింగ్ టూర్' (ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే పర్యటన) చేపట్టే ప్రణాళికలను CJP ఇప్పటికే ప్రకటించింది'' అని అభిజీత్ దీప్కే తెలిపారు.












