Dial 112: తెలంగాణలో అత్యవసర సేవలకు కొత్త నెంబర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు డయల్ 100 కు కాల్ చేసే వాళ్లు. ఇక నుంచి డయల్ 100 స్థానంలో ఒకే ఒక్క ఎమర్జన్సీ నెంబర్ డయల్ 112 ను అందుబాటులోకి తెచ్చారు. డయల్ 112 సేవలను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. ఇకపై పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక వంటి అన్ని అత్యవసర సేవలకు కోసం డయల్ 112ను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. ప్రజలంతా ఈ నెంబర్ ను సేవ్ చేసుకోవాలన్నారు. ఇకపై ఒకేసారి 960 కాల్స్ తీసుకునేలా సిస్టమ్ ను అప్ డేట్ చేశారు.
''డయల్ 112 ద్వారా 18 రకాల సేవలు అంబాటులోకి వస్తాయి. పోలీస్, అగ్నిమాపక, వైద్య సేవలన్నీ ఒకే గొడుగు కిందకు వస్తాయి. అత్యవసర సమయాల్లో అండగా ఉండేందుకు ఈ సేవలను తీసుకొచ్చాం. 100, 101, 108 వంటి నెంబర్ల కింద అందే సేవలన్నీ ఇకపై 112 ద్వారా అందిస్తాం. ఈ కొత్త సేవ ద్వారా ప్రజలు అత్యవసర సమయంలో తక్షణ సాయం పొందుతారు. ప్రజలకు మరింత వేగంగా, సులభంగా సాయం అందుతుంది'' అని డీజీపీ తెలిపారు.
''సాంప్రదాయ పోలీసింగ్‌తో పాటు టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్‌ను కూడా అమలు చేస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లోని టవర్ బిలో రెండు అంతస్తులను ప్రత్యేకంగా డయల్ 112 కార్యకలాపాల కోసం కేటాయించాము. జీవీకే సహకారంతో 2013లో కొంపల్లిలో డయల్ 100 అత్యవసర సేవ ప్రారంభమైంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం పలు సేవల కోసం ఒకే అత్యవసర నంబర్‌ను ప్రతిపాదించింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి, పోలీస్ శాఖ తన టెక్నాలజీ మౌలిక సదుపాయాలను నిరంతరం అప్‌గ్రేడ్ చేస్తూనే ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటీవల పలు పోలీసింగ్ విధులను వేగవంతంగా, మరింత సమర్థవంతంగా చేసింది'' అని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.












