National

Polymer Currency Notes: ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ముహూర్తం ఫిక్స్..! అప్పటి నుంచి వాడకంలోకి..

రచన: NK5 నిమిషాల పఠనం

ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల గురించి విస్తృతమైన చర్చ జరుగుతోంది. త్వరలోనే అవి వాడకంలోకి వస్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Polymer Currency Notes: ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల గురించి విస్తృతమైన చర్చ జరుగుతోంది. త్వరలోనే అవి వాడకంలోకి వస్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పాలిమర్ బ్యాంక్ నోట్లను వేర్వేరు కండీషన్స్ లో టెస్ట్ చేస్తామన్నారు.

అంతా అనుకున్నట్లే జరిగితే వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 2027 నుంచే వాటిని లాంచ్ చేస్తామన్నారు. చాలా దేశాల్లో 30 ఏళ్ల క్రితం నుంచే పాలిమర్ నోట్లు వాడకంలో ఉన్నాయని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. పేపర్ నోట్లతో పోలిస్తే పాలిమిర్ కరెన్సీ నోట్ల లైఫ్ 4 రెట్లు ఎక్కువ అని వెల్లడించారు.

''వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి దేశంలో పాలిమర్ (ప్లాస్టిక్)తో తయారు చేసిన కరెన్సీ నోట్లు చలామణిలోకి రానున్నాయి. మేము ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నాము. మన దేశ పరిస్థితులు, వాతావరణం, మనం ఏర్పాటు చేసిన ఇతర మౌలిక సదుపాయాల నేపథ్యంలో అవి ఎలా పనిచేస్తాయో మేము పరీక్షిస్తాము. ఆ తర్వాత, వాటిని యథాతథంగా లేదా కొన్ని మార్పులతో విస్తృతం చేయాలా వద్దా అనేది పరిశీలిస్తాము" అని ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం అనంతరం మీడియా సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.

"అంతా అనుకున్నట్లుగా జరిగితే, వచ్చే ఆర్థిక సంవత్సరం ఆరంభం నాటికి పాలిమర్ నోట్లు చలామణిలోకి తెచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నాము. పాలిమర్ నోట్లు రెండు ప్రయోజనాలను నెరవేరుస్తాయి. మొదటగా, ఇవి తక్కువ విలువ కలిగిన నోట్ల మన్నికను, వాటి వినియోగ కాలాన్ని పెంచుతాయి. ఈ రకమైన నోట్లు చేతులు మారే వేగం ఎక్కువగా ఉండటం వల్ల, సాధారణంగా వాటి ఆయుష్షు తక్కువగా ఉంటుంది.

వివిధ దేశాల్లో ఈ పాలిమర్ నోట్లు 30 ఏళ్లకు పైగా చలామణిలో ఉన్నాయి. కాగితపు నోట్లతో పోలిస్తే వీటి మన్నిక మూడు నుండి నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇక రెండవది.. ఆర్థిక వ్యవస్థ అవసరాలు పెరిగేకొద్దీ ఇటువంటి పాలిమర్ నోట్లు ఆర్బీఐ సామర్థ్యాన్ని విస్తరిస్తాయి. కొత్త నోట్లలో అనేక భద్రతా ఫీచర్లు ఉంటాయి" అని ఆర్బీఐ గవర్నర్ వివరించారు.

పాలిమర్ నోట్ల ముద్రణ, చలామణికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. పాలిమర్ సబ్‌స్ట్రేట్ (పాలిమర్ పేపర్) సేకరణ కోసం ఆర్బీఐ టెండర్‌ను ఆహ్వానించింది. సుమారు 60 దేశాలలో పాలిమర్ నోట్లు పూర్తిగా లేదా పాక్షికంగా చలామణిలో ఉన్నాయి. వీటిలో ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్, వియత్నాం వంటి కొన్ని దేశాలు ఉన్నాయి. ఇటువంటి నోట్లను పలుచని, సులభంగా వంగే ప్లాస్టిక్ ఫిల్మ్‌తో తయారు చేస్తారు.

#Polymer Currency Notes#RBI#Reserve Bank Of India#Sanjay Malhotra#Plastic Currency#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి