తెలంగాణ

Telangana: ఫలిస్తున్న బిజెపి పెద్దల వ్యూహం.. బండి-ఈటల మధ్య తగ్గిన దూరం!..

రచన: Venu4 నిమిషాల పఠనం

గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఇద్దరూ పార్టీలో బలమైన నేతలు కావడంతో ఈ అంతర్గత విభేదాలు పార్టీ ఎదుగుదలకు అడ్డంకిగా మారుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒకప్పుడు విభేదాలతో వార్తల్లో నిలిచిన ఇద్దరు కీలక నేతలు.. ఇప్పుడు ఒకే వేదికపై కనిపించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసంలో ఎంపీ ఈటల రాజేందర్ లంచ్ మీటింగ్‌కు హాజరయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఎంపీ లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను బండి సంజయ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మంచి సంభాషణలు ఎప్పుడూ కొత్త ఆలోచనలకు దారి తీస్తాయని పేర్కొన్నారు. ఇక గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఇద్దరూ పార్టీలో బలమైన నేతలు కావడంతో ఈ అంతర్గత విభేదాలు పార్టీ ఎదుగుదలకు అడ్డంకిగా మారుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఈ క్రమంలో అసలు బండి, ఈటల మధ్య గ్యాప్ ఎక్కడ మొదలైంది? అనే ప్రశ్నలు ఉదయించాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్న సమయంలో పార్టీని దూకుడుగా ముందుకు తీసుకెళ్లారు. మరోవైపు టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌కు కూడా పార్టీలో ప్రత్యేక గుర్తింపు లభించింది. అయితే నాయకత్వ ప్రాధాన్యతలు, కార్యక్రమాల నిర్వహణ, భవిష్యత్ వ్యూహాల విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయనే ప్రచారం జరిగింది.

ఈ పరిణామాలను గమనించిన బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. ముందుగా పార్టీలోని అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి అభయ్ పాటిల్ ఇద్దరు నేతలతో సమావేశమై సమన్వయం కోసం ప్రయత్నించారు. హైదరాబాద్‌లో జరిగిన ఆ భేటీ తర్వాత బండి సంజయ్, ఈటల రాజేందర్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది.

ఈ సంఘటన జరిగి నెల రోజులు గడవకముందే ఢిల్లీ వేదికగా మరోసారి వీరిద్దరూ కలవడం.. పార్టీలో కొత్త సమీకరణాలకు సంకేతంగా భావిస్తున్నారు. గత విభేదాలను పక్కన పెట్టి ఇద్దరు నేతలు కలిసి పనిచేస్తే తెలంగాణలో బీజేపీ బలం మరింత పెరుగుతుందని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కాగా బండి, ఈటల కలయిక తెలంగాణ బీజేపీలో నిజమైన ఐక్యతకు నాంది అవుతుందా? లేక రాజకీయ మర్యాదలకే ఇది పరిమితం అవుతుందా? అనేది త్వరలో తెలనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

#Telangana#political news#BJP#Bandi Sanjay#Etela Rajender
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి