Mark Zuckerberg: ఫేస్ బుక్ లో ప్రధాని మోదీ వీడియో తాత్కాలిక తొలగింపు వివాదం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ దిగొచ్చాడు. వీడియో తొలగింపు అంశంలో భారత ప్రభుత్వానికి అతడు క్షమాపణలు చెప్పాడు.
ప్రధాని మోదీ వీడియో తొలగింపు అంశంతో పాటు తమ ప్లాట్‌ఫామ్స్ లో చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్, డీప్‌ఫేక్ కంటెంట్ వ్యాప్తిపై విచారం వ్యక్తం చేశాడు. దాంతోపాటు తమ ప్లాట్ ఫామ్స్ నిర్వహణలో తీవ్ర పొరపాట్లు జరిగినట్లు అంగీకరించాడు. అందుకు చింతిస్తున్నట్లు చెప్పాడు. కొన్ని రకాల కంటెంట్ ను బూస్ట్ (ప్రోత్సహించేందుకు) చేసేందుకు భారీగా డబ్బులు తీసుకున్నట్లు మెటా ఒప్పుకుంది.
ఇటీవల ప్రధాని మోదీ వీడియోను ఫేస్‌బుక్ లో కాసేపు తొలగించిన సంగతి తెలిసిందే. దీన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. ప్రధాని మోదీ పోస్ట్ తొలగింపుపై 3 రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మెటాను కేంద్రం ఆదేశించింది. గడువులోగా స్పందించకపోతే మెటా 'సేఫ్ హార్బర్' రక్షణను కోల్పోతుందని హెచ్చరించింది.
ఈ పరిణామాల మధ్య మెటా ప్రతినిధులు ఐటీ కార్యదర్శితో భేటీ అయ్యారు. అభ్యంతరకర, తప్పుడు కంటెంట్ వ్యాప్తిపై భారత ప్రభుత్వం లేవనెత్తిన ఆందోళనలను మెటా ప్రతినిధులు అంగీకరించారని, ప్లాట్‌ఫామ్ నిర్వహణలో జరిగిన పొరపాట్లపై జుకర్‌బర్గ్ క్షమాపణలు చెప్పారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లను వందల మిలియన్ల మంది ప్రజలు ఉపయోగిస్తున్నారు. వినియోగదారుల పరంగా భారతదేశం మెటాకు అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో నిరసనలు ఉధృతంగా జరుగుతున్న సమయంలో జూలై 23న ప్రధాని మోదీ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశారు. అయితే, మెటా యాజమాన్యంలోని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల నుండి ఈ వీడియోను తొలిగించారు. కాసేపటి తర్వాత పునరుద్ధరించారు.












