వానాకాలం మొదలై పంటలు చేతికి వచ్చే సమయం దగ్గరపడుతున్నా.. ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకు మాత్రం పంట రుణాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. సహకార బ్యాంకుల ద్వారా అందాల్సిన క్రాప్ లోన్లు నిలిచిపోవడంతో వేలాది మంది రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సాగుకు పెట్టుబడి లేక ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
సాధారణంగా నాబార్డ్ నుంచి టెస్కాబ్‌కు, అక్కడి నుంచి జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (డీసీసీబీలు), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు పంట రుణాలు అందుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వడ్డీ రాయితీ పథకాల ప్రకారం రైతులకు 7 శాతం లోపు వడ్డీకే రుణాలు అందించాలనే నిబంధన ఉంది.
అయితే ప్రస్తుతం టెస్కాబ్ వద్ద సొంత నిధులు లేకపోవడంతో నాబార్డ్ రీఫైనాన్స్‌పై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో వడ్డీ రేటు 8 శాతానికి పైగా చేరుతోంది. అదనపు వడ్డీ భారాన్ని భరించే పరిస్థితి లేక టెస్కాబ్ కొత్త క్రాప్ లోన్ల కేటాయింపులను నిలిపివేసింది.
గతంలో సహకార రుణ వ్యవస్థ రైతులకు అండగా నిలిచేది. ముఖ్యంగా వాణిజ్య బ్యాంకుల కంటే వేగంగా రుణాలు మంజూరు చేస్తూ సాగుకు అవసరమైన పెట్టుబడిని అందించేది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 107 ప్రాథమిక సహకార సంఘాల ద్వారా వేలాది మంది రైతులు ప్రతి సీజన్‌లో రుణాలు పొందేవారు. గత ఆర్థిక సంవత్సరంలోనే రూ.328 కోట్ల నుంచి రూ.623 కోట్లకు పైగా క్రాప్ లోన్లు పెరిగి దాదాపు రూ.296 కోట్ల అదనపు రుణాలు మంజూరయ్యాయి.
ఒకప్పుడు రాష్ట్రంలో చివరి స్థానాల్లో ఉన్న నల్లగొండ డీసీసీబీ.. రుణాల పంపిణీ, రికవరీలో అద్భుత పనితీరుతో రెండో స్థానానికి చేరుకుని రాష్ట్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ ప్రశంసలు కూడా అందుకుంది. దాదాపు రూ.3 వేల కోట్ల టర్నోవర్ సాధించి సహకార బ్యాంకింగ్ రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.
అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ పూర్తికాకపోవడం, ఆర్‌బీఐ నుంచి అనుమతులు ఆలస్యం కావడం, టెస్కాబ్ వద్ద నిధుల కొరత, డీసీసీబీల ఆర్థిక ఇబ్బందులు కలిసి రైతు రుణాల పంపిణీపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొన్ని జిల్లాల్లో కొంత నిధులు ఉన్నా అందరికీ సమానంగా ఇవ్వలేమనే కారణంతో రుణాల పంపిణీనే నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తోంది.
మరోవైపు సహకార సంఘాలు, డీసీసీబీలకు ఎన్నికలు జరగక పాలకవర్గాలు లేకపోవడం కూడా సమస్యను మరింత తీవ్రం చేసింది. గతంలో చైర్మన్లు, డైరెక్టర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు సమీకరించే ప్రయత్నాలు చేసేవారు. ఇప్పుడు అధికారుల ఆధ్వర్యంలోనే వ్యవహారాలు నడుస్తుండటంతో ప్రత్యామ్నాయ మార్గాలపై పెద్దగా చర్యలు కనిపించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
సాగు ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్న సమయంలో బ్యాంకు రుణాలు అందకపోవడంతో రైతులు అధిక వడ్డీకి అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని టెస్కాబ్‌కు నిధులు విడుదల చేయడంతో పాటు డీసీసీబీల ద్వారా వెంటనే క్రాప్ లోన్లు అందేలా చర్యలు చేపట్టాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు కోరుతున్నారు.












