అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్నారు.. గతంలో ఎన్నికల ప్రచార సభలో హత్యాయత్నం నుంచి బయటపడిన ట్రంప్.. తాజాగా హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న సమయంలోనూ ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక హెలికాప్టర్ మెరైన్ వన్.. ఓ ప్రయాణికుల విమానానికి అత్యంత సమీపానికి చేరుకోవడంతో అమెరికా భద్రతా వర్గాల్లో ఆందోళన వ్యక్తమైంది.
అమెరికా కాలమానం ప్రకారం ఆగస్టు 4న ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రంప్ కాలిఫోర్నియాకు ప్రయాణిస్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న మెరైన్ వన్ హెలికాప్టర్.. అమెరికా రాజధాని వాషింగ్టన్ గగనతలంలో ఓ కమర్షియల్ ప్యాసింజర్ విమానానికి ఒక మైలు కంటే తక్కువ దూరానికి చేరుకుంది. సాధారణంగా రెండు విమానాల మధ్య కనీసం మైలున్నర భద్రతా దూరం ఉండాల్సి ఉండగా.. ఈ ఘటనలో ఆ దూరం గణనీయంగా తగ్గినట్లు అధికారులు గుర్తించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్‌లో తలెత్తిన లోపాలే ఈ పరిస్థితికి కారణమై ఉండొచ్చని తెలుస్తోంది. పరిస్థితిని వెంటనే గుర్తించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు రెండు విమానాల పైలట్లను అప్రమత్తం చేయడంతో ప్రమాదం త్రుటిలో తప్పింది.. ఈ ఘటనపై అమెరికా విమానయాన నియంత్రణ సంస్థ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) దర్యాప్తు ప్రారంభించాయి.
కమ్యూనికేషన్‌లో లోపం ఎలా తలెత్తింది? భద్రతా నిబంధనలు ఎందుకు పాటించబడలేదు? అనే అంశాలపై సమగ్ర విచారణ చేపట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించారు. పూర్తి నివేదిక అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని ఎఫ్‌ఏఏ తెలిపింది. ఈ ఘటనపై వైట్ హౌస్ స్పందిస్తూ.. అధ్యక్షుడు ట్రంప్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదని స్పష్టం చేసింది. మెరైన్ వన్‌ను అత్యంత అనుభవజ్ఞులైన మెరైన్ కార్ప్స్ పైలట్లు నడుపుతారని, భద్రతా వ్యవస్థ అత్యున్నత ప్రమాణాలతో పనిచేస్తోందని పేర్కొంది.
మరోవైపు డొనాల్డ్ ట్రంప్ భద్రతపై గత కొన్నేళ్లుగా అనేకసార్లు చర్చ జరిగింది. 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో పెన్సిల్వేనియాలో జరిగిన సభలో ఆయనపై కాల్పులు జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటనలో బుల్లెట్ ఆయన చెవిని తాకగా.. ట్రంప్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అనంతరం అమెరికా సీక్రెట్ సర్వీస్ భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. అప్పటి నుంచి ట్రంప్ పాల్గొనే ప్రతి కార్యక్రమంలో భద్రతా ప్రమాణాలను మరింత పెంచారు.
ఇక రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ వరుస కీలక నిర్ణయాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు. అక్రమ వలసలపై కఠిన చర్యలు, అమెరికా-మెక్సికో సరిహద్దు భద్రత బలోపేతం, దిగుమతులపై సుంకాల విధానం, అమెరికా తయారీ రంగానికి ప్రోత్సాహం, విదేశాంగ విధానంలో దూకుడు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అంతర్జాతీయ వాణిజ్యం, భద్రత, వలస విధానాలపై ఆయన నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.












