International

Russia: రష్యా సైన్యంలో కీలక మార్పులు.. భారీగా సైనిక దళాల పెంపు!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

రష్యా రక్షణ దళాల సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసి, సైనిక సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఆర్మీలోని కమాండ్, లాజిస్టిక్స్ వ్యవస్థలను పునర్వ్యవస్థీకరిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖలో పలువురు ఉన్నతాధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించారు.

 రష్యా రక్షణ దళాల సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసి, సైనిక సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఆర్మీలోని కమాండ్, లాజిస్టిక్స్ వ్యవస్థలను పునర్వ్యవస్థీకరిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖలో పలువురు ఉన్నతాధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించారు. క్రెమ్లిన్‌లో రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్, చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వాలెరీ గెరాసిమోవ్‌లతో పుతిన్ నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం ఈ నియామకాలను అధికారికంగా ప్రకటించారు.

 తాజా నియామకాల ప్రకారం, డిప్యూటీ రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అలెగ్జాండర్ సాంచిక్‌కు ఆయుధాల సేకరణ, సరఫరా సేవలను పర్యవేక్షించే కీలక బాధ్యతలను కేటాయించారు. మరొక డిప్యూటీ రక్షణ మంత్రిగా వాలెరీ సోలోడ్‌చుక్‌ను నియమించారు. ఆయనకు ఆర్మీకి సంబంధించిన మొత్తం లాజిస్టిక్స్ వ్యవహారాల పర్యవేక్షణను అప్పగించారు. యుద్ధంలో వ్యూహాత్మకమైన దొనెట్స్క్ ప్రాంతంలో బాధ్యతలు నిర్వర్తించే 'సెంటర్ గ్రూప్ ఆఫ్ ఫోర్సెస్' కమాండర్‌గా ఆండ్రీ ఇవానాయెవ్‌ను, ఈస్టర్న్ మిలిటరీ డిస్ట్రిక్ట్ యాక్టింగ్ కమాండర్‌గా ప్యోటర్ బోల్గారెవ్‌ను ఎంపిక చేశారు.

 అదేవిధంగా, భవిష్యత్ అవసరాలకు కొత్తగా ఏర్పాటు చేసిన మానవరహిత వ్యవస్థల (డ్రోన్) దళాల సారథ్యాన్ని డెనిస్ లయామిన్‌కు అప్పగించారు. మరోవైపు.. దేశ సైనిక బలాన్ని పెంచే దిశగా పుతిన్ ఇటీవల ఒక ప్రత్యేక డిక్రీపై సంతకం చేశారు. దీని ద్వారా సైనిక సిబ్బంది సంఖ్యను అదనంగా మరో 25,000 మందికి పెంచారు. ఈ తాజా పెంపుతో రష్యా సైనిక దళాల మొత్తం సంఖ్య 24,26,130కి చేరుకోగా, అందులో నేరుగా విధులు నిర్వర్తించే క్రియాశీల (యాక్టివ్) సైనికుల సంఖ్య 15,35,000గా ఉంది.

 రష్యా సాయుధ బలగాల్లో లాజిస్టిక్స్, సేకరణ, సమన్వయం, డ్రోన్ పోరాట సామర్థ్యాలను ఒకే తాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక మార్పులు చేపట్టినట్లు స్పష్టమవుతోంది. ప్రత్యక్ష యుద్ధ రంగంలో కమాండ్ వ్యవస్థను మరింత వేగవంతం చేసేందుకు ఈ కొత్త నియామకాలు దోహదపడతాయని నిపుణులు భావిస్తున్నారు.

#Vladimir Putin Military Reshuffle#Russian Armed Forces News#Alexander Sanchik Logistics#Valery Solodchuk Deputy Defense Minister#Denis Lyamin Drone Forces#Donetsk Centre Group Forces#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి