15 ఏళ్ల పిన్న వయసులోనే భారత జాతీయ జట్టులో చోటు సంపాదించి, దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప కీలక సూచనలు చేశారు. 2026 ఐపీఎల్‌లో అగ్రశ్రేణి స్కోరర్‌గా నిలిచి వార్తల్లో నిలిచిన వైభవ్, ఇటీవలి జింబాబ్వే పర్యటనలో తన నాలుగో మ్యాచ్‌లోనే తొలి అంతర్జాతీయ అర్ధశతకం సాధించి తన అసాధారణ ప్రతిభను చాటుకున్నాడు. అయితే, ఈ వేగవంతమైన ఎదుగుదల క్రమంలో వైభవ్ కెరీర్ దారితప్పకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఊతప్ప అభిప్రాయపడ్డారు.
ఒక యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఊతప్ప మాట్లాడుతూ.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ కంటే పెద్ద ప్రభావం చూపగల సత్తా వైభవ్‌కు ఉందనడంలో సందేహం లేదన్నారు. కానీ, గతంలో వినోద్ కాంబ్లీ, పృథ్వీ షా వంటి అద్భుతమైన ప్రతిభావంతులు తొలినాళ్లలో ఎంతో ఆశలు రేకెత్తించి, ఆ తర్వాత అకస్మాత్తుగా దారితప్పిన విషయాన్ని గుర్తుచేశారు. వైభవ్‌కు అసలైన పరీక్ష ఇప్పుడే మొదలైందని, మరో ఐదేళ్ల పాటు అంటే 20 ఏళ్ల వయసు వచ్చే వరకు ఏకాగ్రత దెబ్బతినకుండా క్రికెట్‌పైనే దృష్టి సారించడమే అతడి ముందున్న ప్రధాన సవాలని చెప్పారు.
ముఖ్యంగా వైభవ్‌ను సోషల్ మీడియా, వాణిజ్య ప్రకటనలు, బ్రాండ్ డీల్స్‌కు దూరంగా ఉంచడం అభినందనీయమైన విషయమని ఊతప్ప పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వయసు పెరిగే కొద్దీ అమ్మాయిల ఆకర్షణ, ప్రకటనలు, సామాజిక శోధనలు పెరిగే ప్రమాదం ఉందని, అవన్నీ ఆటగాళ్ల దృష్టిని మళ్లించే అవకాశం ఉందని హెచ్చరించారు. క్రికెట్ కోసమే పుట్టిన ఈ యువ కెరటాన్ని విరాట్ కోహ్లీ తరహాలోనే ప్రత్యేకమైన క్రికెటింగ్ వాతావరణం(బబుల్)లోనే పెరగనివ్వాలని సూచించారు.
సెప్టెంబర్ 19నుంచి ప్రారంభం కానున్న ఆసియా క్రీడల్లో వైభవ్ సూర్యవంశీ తదుపరి భారత్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ క్రమంలో ప్రతిభ కలిగిన యంగ్ క్రికెటర్‌ను భారత క్రికెట్ వర్గాలు సముచితమైన రీతిలో మార్గదర్శకత్వం వహించి ముందుకు నడిపించాలని క్రీడా విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.












