సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ తమ ఎత్తుగడలను మార్చుకుంటూ మరింత తెలివిగా మోసాలకు పాల్పడుతున్నారు. ఒకప్పుడు ఓటీపీలు అడిగేవారు.. తర్వాత కేవైసీ, విద్యుత్ బిల్లు, కొరియర్ పేర్లతో మోసాలు చేశారు. ఇప్పుడు "RTO Challan.apk" పేరుతో ఏపీకే ఫైళ్లను పంపిస్తూ కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. ట్రాఫిక్ చలాన్ పెండింగ్‌లో ఉందని, వెంటనే చెల్లించాలని భయపెట్టే సందేశాలు పంపించి, ఆ లింక్‌ను క్లిక్ చేయగానే ఫోన్‌పై పూర్తి నియంత్రణ సాధించే ప్రయత్నం చేస్తున్నారు.
దీంతో బ్యాంకు ఖాతాలు, యూపీఐ యాప్‌లు, వ్యక్తిగత సమాచారం క్షణాల్లో సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఇలాంటి మోసాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా జనగామకు చెందిన ఓ కారు యజమాని "ఆర్టీవో చలాన్" పేరుతో వచ్చిన లింక్‌ను క్లిక్ చేయగా, అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.50 వేల వరకు సైబర్ నేరగాళ్లు కాజేశారు. మరోవైపు పాలకుర్తికి చెందిన ఓ యువకుడు కూడా ఇదే తరహా లింక్‌ను తెరవడంతో రూ.30 వేల వరకు కోల్పోయాడు. ఈ ఘటనలపై బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి, రఘునాథపల్లి, లింగాలఘనపురం, బచ్చన్నపేట తదితర ప్రాంతాల్లో ఇలాంటి ఏపీకే ఫైళ్ల ద్వారా మోసాలు పెరుగుతున్నాయి. వాట్సాప్ గ్రూపులు, వ్యక్తిగత మొబైల్ నంబర్లకు నేరగాళ్లు సందేశాలు పంపిస్తూ ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అవగాహన ఉన్నవారు వాటిని పట్టించుకోకపోయినా, టెక్నాలజీపై సరైన అవగాహన లేని వారు మాత్రం సులభంగా ఉచ్చులో పడుతున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం సైబర్ నేరగాళ్లు కృత్రిమ మేధస్సు (AI), నకిలీ వెబ్‌సైట్లు, నమ్మశక్యం కాని మెసేజ్‌లు, అధికారిక లోగోలు వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తూ ప్రతి రోజూ తమ మోసాల తీరును అప్‌డేట్ చేసుకుంటున్నారు. కానీ అదే వేగంతో ప్రజల్లో డిజిటల్ అవగాహన పెరగడం లేదు. "లింక్ వచ్చింది అంటే నిజమే అయి ఉంటుంది", "ప్రభుత్వం పంపిందేమో" అనే నమ్మకం ఇప్పటికీ చాలా మందిలో ఉండటంతో సైబర్ నేరగాళ్లకు అవకాశం లభిస్తోంది. టెక్నాలజీ ఎంత వేగంగా మారుతుందో, ప్రజల్లో కూడా అవగాహన మరింత పెరగాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక మోసాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను పరిశీలిస్తే.. వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్‌లో వచ్చే APK ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ చేయకూడదు.. ట్రాఫిక్ చలాన్ వివరాలు తెలుసుకోవాలంటే అధికారిక పరివాహన్ లేదా రాష్ట్ర రవాణా శాఖ వెబ్‌సైట్‌లో మాత్రమే తనిఖీ చేయాలి.. ఫోన్‌లో అనుమానాస్పద యాప్ కనిపిస్తే వెంటనే తొలగించాలి.. మోసపోయినట్లు గుర్తిస్తే వెంటనే బ్యాంకుకు సమాచారం ఇచ్చి ఖాతాను బ్లాక్ చేయించాలి. అలాగే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు cybercrime.gov.inలో ఫిర్యాదు నమోదు చేయడంతో పాటు సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ పోలీసులను వెంటనే సంప్రదించాలి.
ఈ విషయంపై అధికారులు మాట్లాడుతూ, రవాణా శాఖ లేదా పోలీస్ శాఖలు సాధారణంగా చలాన్ చెల్లింపుల కోసం APK ఫైళ్లు లేదా ఇలాంటి అనుమానాస్పద లింక్‌లు పంపవని స్పష్టం చేశారు. అలాంటి సందేశాలు వస్తే వెంటనే అప్రమత్తంగా ఉండాలని, అధికారిక వెబ్‌సైట్లు ద్వారానే చలాన్ వివరాలు పరిశీలించాలని వాహనదారులకు సూచించారు. అలాగే సైబర్ నేరగాళ్లు ప్రతిరోజూ కొత్త పద్ధతులతో నేరాలు చేస్తున్నారు కాబట్టి.. ప్రజలు కూడా డిజిటల్ భద్రతపై అవగాహన పెంచుకోవడం మాత్రమే ఈ తరహా మోసాలను అరికట్టే మార్గమని అధికారులు హెచ్చరిస్తున్నారు.












