రాష్ట్ర బీజేపీలో సానుకూల వాతావరణం కనిపిస్తోంది. ఇటీవల పార్టీలోని కీలక నేతలైన కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ నడుమ వివాదం రాజుకున్న విషయం తెలిసిందే.తన నియోజకవర్గంలో కేంద్రమంత్రి బండి జోక్యం చేసుకుంటున్నారని, తన వారిని కాదని ఆయన వర్గానికి,అనుచరులకు పదవులు ఇప్పించుకుంటున్నాడని ఈటల రాజేందర్ పలుమార్లు బహిరంగంగానే విమర్శలు చేశారు. అయితే, కేంద్రంలోని బీజేపీ పెద్దల జోక్యంతో ఇరువురి మధ్య సయోధ్య కుదరడంతో ఇంతకాలం పెండింగులో ఉన్న జిల్లా అధ్యక్ష పోస్టులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది.
బీజేపీలో గత కొంతకాలంగా మూడు జిల్లా అధ్యక్షుల పదవులు పెండింగులో ఉన్నాయి. ఈ క్రమంలోనే కరీంనగర్, వికారాబాద్, మేడ్చల్ (అర్బన్) జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు గురువారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా సాయి మల్లేశం, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా యూ.రమేశ్, మేడ్చల్ (అర్బన్) జిల్లా అధ్యక్షుడిగా గిరివర్ధన్ రెడ్డిలను నియమించారు.
ఈ మూడు జిల్లాల అధ్యక్షుల ఎంపిక విషయంలోనూ ఈటల రాజేందర్, బండి సంజయ్ నడుమ తీవ్ర విభేదాలు నెలకొనగా.. తమ వర్గానికి చెందిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇరువురు పట్టుబట్టడంతో గత కొంతకాలంగా నియామకాలు నిలిచిపోయాయి. పార్టీ నాయకత్వం సైతం వీటిని హోల్డ్ చేసింది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి జోక్యం చేసుకుని ఇరువురి నేతల మధ్య సయోధ్య కుదిర్చారు. పార్టీకి ముందు ప్రాధాన్యం ఇవ్వాలని.. అధికారంలోకి వచ్చాక పదవులు సంగతి చూద్దామని చెప్పడంతో కీలక నేతలు శాంతించారు. ఈ క్రమంలోనే అన్ని వర్గాలకూ ఆమోదయోగ్యమైన పేర్లను పరిశీలించి ఖరారు చేస్తూ కమలం పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది.












