తెలంగాణ

Telangana: కోల్ గ్యాసిఫికేషన్‌లో ఏపీ దూకుడు.. 130 ఏళ్ల బొగ్గు చరిత్ర ఉన్న తెలంగాణకు ఏమైంది?..

రచన: Venu5 నిమిషాల పఠనం

దశాబ్దాలుగా బొగ్గు తవ్వకాలకు కేంద్రంగా ఉన్న తెలంగాణలోనే తొలి కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు వస్తుందని అంతా భావించారు. 130 ఏళ్లకు పైగా బొగ్గు తవ్వకాలు చేస్తున్న సింగరేణి సంస్థ బెల్లంపల్లి ప్రాంతంలో ప్రాజెక్టు ఏర్పాటుపై కసరత్తు కూడా ప్రారంభించింది.

భవిష్యత్ ఇంధన రంగాన్ని మార్చే సాంకేతికతగా భావిస్తున్న కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన వేలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన సంస్థ ఏలూరు జిల్లా చింతలపూడి సెక్టార్–1, రేచెర్ల కోల్ బ్లాకులను దక్కించుకుంది.

దాదాపు లక్ష కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో భూగర్భంలోని బొగ్గును గ్యాస్‌గా మార్చే మెగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనుంది. 2029 నాటికి ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

మరోవైపు దశాబ్దాలుగా బొగ్గు తవ్వకాలకు కేంద్రంగా ఉన్న తెలంగాణలోనే తొలి కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు వస్తుందని అంతా భావించారు. 130 ఏళ్లకు పైగా బొగ్గు తవ్వకాలు చేస్తున్న సింగరేణి సంస్థ బెల్లంపల్లి ప్రాంతంలో ప్రాజెక్టు ఏర్పాటుపై కసరత్తు కూడా ప్రారంభించింది. కానీ ఆలోపు ఏపీలో రిలయన్స్ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలో.. ఇది తెలంగాణ వైఫల్యమా..? లేక పెట్టుబడులను ఆకర్షించడంలో వచ్చిన ఆలస్యమా..? అనే ప్రశ్నలు రాష్ట్రంలో తలెత్తాయి.. తెలంగాణలో బొగ్గు నిల్వలు, అనుభవం, మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ.. ప్రాజెక్టు ప్రతిపాదనలు, అనుమతులు, పెట్టుబడుల విషయంలో వేగం తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ మాత్రం వేలం ప్రక్రియలో బ్లాకులను దక్కించుకుని.. ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంలో ముందడుగు వేసింది. కేంద్ర విధానాలకు అనుగుణంగా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం కూడా ఏపీకి కలిసి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు.. ఇక కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్ ఏర్పాటు అంత సులభమైన ప్రక్రియ కాదు. రోజుకు వెయ్యి టన్నుల బొగ్గును గ్యాసిఫై చేసే ప్లాంటుకు వంద ఎకరాల భూమి, భారీగా నీరు, విద్యుత్ అవసరం ఉంటుంది.

సుమారు నాలుగు వేల కోట్ల పెట్టుబడితో ఒక ప్లాంట్ ఏర్పాటు కావాల్సి ఉంటుంది. ప్రత్యక్షంగా వందలాది మందికి ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి. తెలంగాణలో రామగుండం, మణుగూరు, కొత్తగూడెం, భూపాలపల్లి వంటి ప్రాంతాలు ఈ ప్రాజెక్టుకు అనుకూలంగా ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు ఆచరణలోకి రాలేదు. దీంతో ఇప్పుడు సింగరేణి తన ఆలోచనలను మార్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది..

మొత్తంగా చూస్తే.. బొగ్గు సంపద ఉన్న తెలంగాణ ప్రేక్షక పాత్ర వహిస్తుండగా.. బొగ్గు గనులు లేని ఏపీ మాత్రం భారీ పెట్టుబడితో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఇక రాబోయే రోజుల్లో ఈ రంగంలో ఎవరు ముందంజ వేస్తారు..? సింగరేణి తన సామర్థ్యాన్ని ఎలా ఉపయోగించుకుంటుంది..? లేక ఏపీనే దక్షిణ భారత కోల్ గ్యాసిఫికేషన్ హబ్‌గా మారుతుందా..? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

#Telangana#AP#coal gasification#Reliance#project
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి