రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న రాష్ట్రంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. సంగారెడ్డి జిల్లా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి దీనిని అధికారికంగా ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో పంపిణీ కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి.
సీఎం ప్రారంభించిన తర్వాత ఆయా సెగ్మెంట్లలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో లబ్ధిదారులకు కార్డులను నేరుగా అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలివిడతలో సుమారు 1.05 కోట్ల కుటుంబాలకు లామినేటెడ్ (పీవీసీ) రూపంలో కొత్త రేషన్ కార్డులను అందజేయనున్నారు. వాటర్ ప్రూఫ్, క్రెడిట్ కార్డు పరిమాణంలో ఉండే 'స్మార్ట్' కార్డులపై క్యూఆర్ కోడ్ ముద్రించి, ఆధునిక భద్రతా ప్రమాణాలు కలిగిన కార్డును అందజేయనున్నట్టు సమాచారం.
కొత్త రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం విజయవంతంగా సాగేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డు అందేలా లబ్ధిదారుల జాబితా ధృవీకరణను (e-KYC) త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు పంపింది. ఇక రేషన్ కార్డుల ముద్రణ స్థాయి నుంచి జిల్లాలకు చేరేంత వరకు రవాణా నిర్వహణపైనా పౌరసరఫరాల శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. పంపిణీలో ఎలాంటి అవాంతరాలు లేకుండా జిల్లా కలెక్టర్లు.. స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని రేవంత్ ప్రభుత్వం ఆదేశించింది. పంపిణీ ప్రక్రియ పూర్తయ్యాక సమగ్ర నివేదికలను ప్రభుత్వానికి అందజేయాల్సిందిగా సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు.












