చేతికి అందివచ్చిన మహా అదృష్టం చిన్న పొరపాటు వల్ల చెత్తబుట్ట పాలైనా.. చివరికి దేవుడి దయ వల్ల మళ్లీ ఆ ఇంట్లోనే వాలింది. కోట్ల రూపాయల విలువైన లాటరీ టికెట్‌ను చెత్తలో పారేసి, ఆ తర్వాత.. శ్రమించి దాన్ని వెతికి పట్టుకున్న మున్సిపల్ సిబ్బంది సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటలీలోని బిటోంటో నగరంలో చోటుచేసుకున్న ఈ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. వివరాలు పరిశీలిస్తే.. బిటోంటోలో నివాసముంటున్న ఓ మహిళ తనకు ఎంతో ఇష్టమైన కొన్ని ప్రత్యేక సంఖ్యలతో తరచూ లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తుండేది.
ఇటీవల నిర్వహించిన డ్రా తర్వాత ఫలితాలను సరిచూసుకునేందుకు ఆమె ఒక స్థానిక దుకాణానికి వెళ్లి మిషన్‌లో టికెట్ స్కాన్ చేసింది. అయితే బహుమతి సొమ్ము భారీగా ఉన్నప్పుడు షాపుల్లో డబ్బులు చెల్లించడం సాధ్యపడక స్క్రీన్‌పై నాన్-పేయబుల్ అని చూపిస్తుంది. ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోని ఆ మహిళ, టికెట్ వేస్ట్ అనుకుని అక్కడే ఉన్న డస్ట్‌బిన్‌లో పారేసి ఇంటికి వెళ్లిపోయింది.
తీరా ఇంటికి వెళ్లాక కుటుంబ సభ్యుల ద్వారా ఆ లక్కీ నంబర్లకే ఏకంగా 10.9కోట్ల రూపాయల భారీ జాక్‌పాట్ తగిలిందని తెలిసి షాకయ్యింది. వెంటనే పరుగు పరుగున సదరు దుకాణానికి వెళ్లగా, అప్పటికే చెత్త లారీ వచ్చి దాన్ని తీసుకెళ్లిపోయింది. దీంతో తీవ్ర ఆందోళన చెందిన ఆమె స్థానిక వ్యర్థాల నిర్వహణ సంస్థను ఆశ్రయించింది. స్పందించిన అధికారులు ఆ రోజు పారిశుధ్య వాహనాలు వెళ్లిన రూట్ ఆధారంగా నిర్దిష్ట గార్బేజ్ ట్రక్‌ను గుర్తించి, వెంటనే దానిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
టన్నుల కొద్దీ పోగుపడిన చెత్తను పారిశుధ్య కార్మికులు ఒక రోజు కంటే ఎక్కువ సమయం పాటు జల్లెడ పట్టి శోధించారు. ఎట్టకేలకు చెత్తకుప్పలో నలిగిపోకుండా భద్రంగా ఉన్న ఆ టికెట్‌ను వెలికితీశారు. ఫోన్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ ఆనందభాష్పాలతో ఉద్వేగానికి లోనైంది. ఈ శోధన ఆపరేషన్‌కు అయిన అదనపు ఖర్చులను భరించేందుకు ఒప్పందం కుదుర్చుకుని, కొన్ని వేల రూపాయల వ్యయంతో కోట్ల విలువైన తన అదృష్టాన్ని సొంతం చేసుకుంది.












