National

కాక్రోచ్ జనతా పార్టీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి..? ఉద్యమమా.. రాజకీయమా..?

రచన: Kashi8 నిమిషాల పఠనం

సీజేపీ కీలక సభ్యుల సమావేశం మ‌రికొద్ది గంట‌ల్లో మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో జరగనుంది. తదుపరి కార్యాచరణను ఖరారు చేయడమే అజెండాగా సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే నివాసంలో భేటీ జరగనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వలంటీర్లు, విద్యార్థులతో చర్చలు జరిపి, సూచనలు, సలహాలతో ఈ సమావేశానికి రావాల్సిందిగా ఇప్పటికే కీలక సభ్యులకు సమాచారం అందింది. ఈ సమావేశం అనంతరం మీడియాతో భేటీ ఉంటుందని, భవిష్యత్‌ కార్యాచరణను వెల్లడించే అవకాశాలున్నాయని సీజేపీ వర్గాలు వివరించాయి.

భ‌విష్య‌త్ వ్యూహంపై సీజేపీ ఫోక‌స్

మ‌రికొద్ది గంట‌ల్లో కీల‌క స‌మావేశం

మ‌హారాష్ట్ర‌లోని ఛ‌త్ర‌ప‌తి శంభాజీన‌గ‌ర్‌లో కీ.. మీటింగ్

జెన్ జీ లో తీవ్ర ఉత్కంఠ‌

దేశ రాజకీయాల్లో గత రెండు నెలలుగా అత్యంత చర్చనీయాంశంగా మారిన పేరు కాక్రోచ్ జనతా పార్టీ. నీట్ పేపర్ లీక్ వివాదంతో ప్రారంభమైన ఈ ఉద్యమం.. కేవలం విద్యా వ్యవస్థకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా యువత ఆకాంక్ష‌ల‌కు ప్రతీకగా మారింది. కేంద్ర ప్రభుత్వం విద్యా శాఖలో మార్పులు ప్రకటించడం, విద్యాశాఖ మంత్రిని తప్పించడం వంటి పరిణామాల తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఒకే అంశంపై ఉంది. ఇవాళ జరుగుతున్న కీలక సమావేశంలో కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్ వ్యూహంపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? ఇదే ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సీజేపీ కీలక సభ్యుల సమావేశం మ‌రికొద్ది గంట‌ల్లో మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో జరగనుంది. తదుపరి కార్యాచరణను ఖరారు చేయడమే అజెండాగా సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే నివాసంలో భేటీ జరగనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వలంటీర్లు, విద్యార్థులతో చర్చలు జరిపి, సూచనలు, సలహాలతో ఈ సమావేశానికి రావాల్సిందిగా ఇప్పటికే కీలక సభ్యులకు సమాచారం అందింది. ఈ సమావేశం అనంతరం మీడియాతో భేటీ ఉంటుందని, భవిష్యత్‌ కార్యాచరణను వెల్లడించే అవకాశాలున్నాయని సీజేపీ వర్గాలు వివరించాయి.

మూడు అంశాల‌పైనే కీల‌క చ‌ర్చ‌

ఈ సమావేశంలో ప్రధానంగా మూడు అంశాలపై చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటిది.. ఉద్యమాన్ని కొనసాగించాలా? రెండోది.. దేశవ్యాప్తంగా సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయాలా? మూడోది.. రాజకీయ పార్టీగా ఎన్నికల్లోకి అడుగుపెట్టే దిశగా ముందుకెళ్లాలా? ప్రస్తుతం హైలెవ‌ల్ సోర్స్ ద్వారా తెలుస్తున్న‌ సమాచారం ప్రకారం తక్షణమే ఎన్నికల రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదనే సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముందుగా దేశవ్యాప్తంగా యువత అభిప్రాయాలను సేకరించి, బలమైన సామాజిక ఉద్యమంగా మారడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టం చేశారు.

ఉద్యమం గరిష్ట స్థాయిలో ఉన్న సమయంలోనే ఎన్నికల్లోకి వెళ్తే.. ప్రజల దృష్టిలో ఇది మరో సాధారణ రాజకీయ పార్టీగా మారిపోయే ప్రమాదం ఉందని వారు భావిస్తున్నారు. అదే సామాజిక ఉద్యమంగా కొనసాగితే మాత్రం అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వంపైనైనా ఒత్తిడి తీసుకురాగల శక్తిగా నిలవొచ్చని విశ్లేషిస్తున్నారు. అందుకే ఇవాళ్టి సమావేశంలో ఉద్యమం ముందా.. ఎన్నికలు ముందా? అనే అంశంపైనే అత్యంత కీలక చర్చ జరిగే అవకాశముంది.

ఇక రాష్ట్రాల‌పై ఫోక‌స్

ఢిల్లీ నిరసనలతో దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చినప్పటికీ, చాలా రాష్ట్రాల్లో కాక్రోచ్ జనతా పార్టీకి బలమైన స్థానిక నిర్మాణం లేదు. అందుకే ప్రతి రాష్ట్రంలో యువజన కమిటీలు, విద్యార్థి నెట్‌వర్క్‌లు, వాలంటీర్ బృందాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరించాలనే లక్ష్యాన్ని పార్టీ ఇప్ప‌టికే ప్రకటించింది.

ఈ సమావేశంలో మరో ఆసక్తికర అంశం.. ఉద్యమ ఎజెండాను విద్యా రంగానికే పరిమితం చేయాలా? లేక నిరుద్యోగం, ప్రభుత్వ నియామకాలు, పారదర్శకత, అవినీతి వంటి అంశాలపై కూడా పోరాటాన్ని విస్తరించాలా? అనేది. ఇప్పటివరకు నీట్, పరీక్షల నిర్వహణ, విద్యా సంస్కరణలే ప్రధాన అజెండాగా ఉన్నా.. యువత ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై కూడా స్వరం వినిపించాలని పార్టీలో డిమాండ్ పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇక రాజకీయ కోణంలో చూస్తే.. కాక్రోచ్ జనతా పార్టీని ఏ పార్టీ కూడా తేలికగా తీసుకునే పరిస్థితి లేదు. ఈ ఉద్యమం సోషల్ మీడియా ద్వారా కోట్లాది మంది యువతను చేరుకోవడంలో సక్సెస్ అయింది. ఇటీవల బాంకీపూర్ ఉప ఎన్నిక ఫలితం కూడా యువ ఓటర్ల మూడ్‌ను అన్ని పార్టీలు సీరియస్‌గా విశ్లేషించేలా చేసింది. అయితే ఆ విజయాన్ని పూర్తిగా CJPకే ఆపాదించడం కంటే, యువతలో పెరుగుతున్న అసంతృప్తికి అది ఒక సంకేతంగా చూడాలని పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు.

ఇవాళ్టి సమావేశంలో అధికారికంగా రాజకీయ పార్టీగా ఎన్నికల్లో పోటీపై నిర్ణయం వచ్చే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. దాని బదులుగా దేశవ్యాప్తంగా యువతతో సంప్రదింపులు, సభ్యత్వ విస్తరణ, స్థానిక కమిటీల ఏర్పాటు, సమస్యల ఆధారంగా ఉద్యమాలను విస్తరించడం వంటి కార్యాచరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మొత్తానికి, కాక్రోచ్ జనతా పార్టీ ముందున్న అసలు సవాల్ వైరల్ కావడం కాదు.. ఆ వైరల్ ఇమేజ్‌ను దీర్ఘకాలిక ప్రజా ఉద్యమంగా మార్చుకోవడం. సోషల్ మీడియా ప్రభంజనాన్ని సంస్థాగత బలంగా మార్చగలిగితేనే ఈ ఉద్యమం భారత రాజకీయాల్లో శాశ్వత ప్రభావాన్ని చూపగలదు. లేదంటే ఇది కూడా కొన్ని నెలల్లో తగ్గిపోయిన డిజిటల్ ఉద్యమాల జాబితాలో చేరిపోతుంది. అందుకే ఇవాళ్టి సమావేశంలో తీసుకునే నిర్ణయాలు.. ఈ ఉద్యమం భవిష్యత్తును మాత్రమే కాదు, 2029 రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

#Cockroach Janata Party#CJP#Abhijit Dipke#CJP Meeting#NEET Protest#Youth Movement#Student Protest#India Politics#Gen Z#Political Analysis#Election Strategy#Education Reform#2029 Elections#National News#Telugu News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి