మరో దందాకు తెరలేపిన ఆ.. ఎమ్మెల్సీ
రియల్ ఎస్టేట్ అయిపోయింది...
ఇప్పుడు విద్యా వ్యవస్థల వంతు
పాదయాత్రకు పైసలు కావాలట..!
ఏంటిది.. ఎమ్మెల్సీ గారు?
ఆయనో ఎమ్మెల్సీ. మూడు జిల్లాల గ్రాడ్యుయేట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఏనాడూ విద్యా వ్యవస్థలోని లోపాలపై పెద్ద ఉద్యమాలు చేసిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు సెడన్‌గా ప్రైవేట్ కాలేజీలపై పడ్డారు. ఎందుకు..? అక్కడ అక్రమాలు జరుగుతున్నాయని నిలదీస్తున్నారు. దీనికి కారణాలేంటి..? ఈ మొత్తం వ్యవహారం వెనుక అసలు లక్ష్యమేంటి..? ఆ ఎమ్మెల్సీ వ్యవహారంపై స్వేచ్ఛ ప్రత్యేక కథనం.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే కేవలం ఒక హోదా కాదు. లక్షల మంది చదువుకున్న యువతకు ప్రాతినిధ్యం వహించే బాధ్యత. విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా వ్యవస్థలో ఎక్కడ సమస్య వచ్చినా ముందుండి ప్రశ్నించాల్సిన స్థానం. అలాంటి బాధ్యతలో ఉన్న ఒక ఎమ్మెల్సీ ఇటీవల ప్రైవేట్ కాలేజీలకి వెళ్లి పెద్ద ఎత్తున హంగామా చేయడం చర్చనీయాంశమైంది. ఒక విద్యార్థి ర్యాంకును రెండు కాలేజీలు తమ ప్రచారానికి ఉపయోగించుకోవడాన్ని ప్రశ్నించడం తప్పు కాదు. ఆ అంశంపై చర్చ జరగాల్సిందే. అక్కడున్న లోపాలపైనా నిలదీయాల్సిందే. కానీ అసలు ప్రశ్న అది కాదు. ఆ ఎమ్మెల్సీకి ఇంకా ఏదో కావాలి..? అదేంటి..?
అదే ఎమ్మెల్సీకి ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న దారుణాలు ఎందుకు కనిపించడం లేదు? ప్రభుత్వ హాస్టళ్లలో నాసిరకం భోజనం తిని విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నారు, మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల పరిస్థితి అత్యంత దయనీయం. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. ఆ ఎమ్మెల్సీ ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల లేమిపై ఎన్ని ఆందోళనలు చేశారు? ఎన్ని ధర్నాలు చేశారు? ఎన్ని రోజులు అధికారులను నిలదీశారు? ఈ ప్రశ్నలకు ఆ ఎమ్మెల్సీ సమాధానం చెప్పగలరా..? ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న 3 జిల్లాల్లోని ప్రభుత్వ విద్యాసంస్థల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. వాటిపై ఆయన పోరాటం చేస్తే బాగుంటుందని ఓట్లేసి గెలిపించిన గ్రాడ్యుయేట్లు డిమాండ్ చేస్తున్నారట. వారికేం సమాధానం చెబుతారు సార్..?
ప్రైవేట్ విద్యాసంస్థలు తప్పు చేస్తే తప్పకుండా ప్రశ్నించాలి. ర్యాంకుల పేరుతో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకోవాలి. అధిక ఫీజులు వసూలు చేస్తే నిలదీయాలి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఆ కాలేజీలేం ఆకాశం నుంచి ఊడిపడలేదు. ఎంతో కష్టపడి పేరెంట్స్ లక్షలకు లక్షలు ఫీజులు కడుతున్నారు. కాబట్టి ఆ కాలేజీలను ప్రశ్నించాల్సిందే. నాణ్యమైన విద్య కోసం వారి మెడలు వంచాల్సిందే. కానీ అదే స్థాయిలో ప్రభుత్వ విద్యలోని లోపాలను కూడా ప్రశ్నించాలి కదా. ఒకవైపు మాత్రమే ఆవేశం చూపించి, మరోవైపు పూర్తిగా మౌనం పాటిస్తే ప్రజల్లో అనుమానాలు రావా ఎమ్మెల్సీ గారు..?
ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మరో చర్చ కూడా వినిపిస్తోంది. త్వరలో ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం ముగియనుంది. మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. ఆయన కొత్తగా పెట్టుకున్న సొంత పార్టీ నుంచే పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత రాజకీయంగా చురుకుగా ఉండేందుకు భారీ పాదయాత్రకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
పాదయాత్రకు పైసలు కావాలా..?
పాదయాత్ర అంటే ఆషామాషీ కాదు. ఎంతో ప్రయాస, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మీడియా కవరేజీ కావాలి. ఆయనతో కలిసి నడిచే వారి బాగోగులు చూసుకోవాలి. ఇందుకు చాలా డబ్బు అవసరమవుతుంది. ఆ పాదయాత్రకు పైసలు కావాలనే ఇదంతా చేస్తున్నారా అనే అనుమానాలు ఆయనకు ఓటేసి గెలిపించిన గ్రాడ్యుయేట్ల నుంచే వినిపిస్తోందట. ఈ ఆరోపణలు నిజమా కాదా అనేది ఆయనే చెప్పాలి. కానీ ప్రజల్లో అలాంటి చర్చకు అవకాశం ఎందుకు వస్తోంది? అనే విషయాన్ని మాత్రం ఆయన ఆలోచించాల్సిందే.
ఒకప్పుడు రియల్ ఎస్టేట్ రంగంపై ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచిన ఆ ఎమ్మెల్సీ... ఇప్పుడు విద్యారంగాన్ని టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ సహా తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది. అందుకే ఆయన టార్గెట్‌ను మార్చుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఒక రంగం తర్వాత మరో రంగాన్ని ఎంచుకుని హడావుడి చేయడం ఉద్యమం కాదు. నిజంగా విద్యార్థుల పక్షాన నిలబడాలంటే విద్యారంగంలో ఉన్న అన్ని సమస్యలపై ఒకే విధంగా పోరాడాలి. ఎంపిక చేసిన కొన్ని కాలేజీలపై మాత్రమే దాడి చేయడం ప్రజల్లో సందేహాలకు తావిస్తోంది.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఈ కార్యక్రమాల్లో కొందరు యూట్యూబ్ ఛానెళ్ల జర్నలిస్టులు కూడా కలిసి కనిపిస్తున్నారు. జర్నలిజం అంటే అధికారాన్ని ప్రశ్నించడం, ప్రజల సమస్యలను వెలుగులోకి తేవడం. కానీ ముందే టార్గెట్ నిర్ణయించుకుని కెమెరాలు ఆన్ చేసి హడావుడి చేయడం జర్నలిజం కాదు. అది ప్రజల్లో విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. నిజమైన మీడియా ఉద్యమాలకు, ప్రచారం కోసం చేసే కార్యక్రమాలకు మధ్య తేడా ప్రజలకు బాగా తెలుసు. ఇదంతా సోషల్ మీడియా జమానా. మనమేం చేస్తున్నామో.. మనకంటే ఎక్కువగా ప్రజలకే తెలుసు. ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.
ఒక ఎమ్మెల్సీ అంటే కేవలం వీడియోల్లో కనిపించడం కాదు. అసెంబ్లీ, మండలి, ప్రజా వేదికలు, అధికారులతో సమావేశాలు... ఇలా అన్ని వేదికలపై విద్యార్థుల కోసం నిరంతరం పోరాడాలి. ప్రభుత్వ విద్యా విధానంలో లోపాలుంటే వాటిని ఎత్తిచూపాలి. హాస్టళ్లలో సమస్యలు ఉంటే అక్కడికి వెళ్లాలి. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు ఇబ్బంది పడితే వారి కోసం నిలబడాలి. అప్పుడు మాత్రమే ఆయన పోరాటానికి విలువ ఉంటుంది.
ప్రైవేట్ కాలేజీలను ప్రశ్నించడం తప్పు కాదు. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా కేవలం ప్రైవేట్ సంస్థల దగ్గర మాత్రమే హడావుడి చేస్తే ప్రజలు ప్రశ్నించడం మొదలుపెడతారు. ఇది నిజంగా విద్యార్థుల కోసం చేస్తున్న పోరాటమా? లేక మరో లక్ష్యంతో చేస్తున్న రాజకీయమా? అనే సందేహం సహజంగానే వస్తుంది. అంతేలే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పైసలొస్తాయా..? రావు కదా.. అందుకే ప్రైవేట్ కాలేజీలపై పడి ఉంటారని మీకు ఓటేసి గెలిపించిన గ్రాడ్యుయేట్లే చర్చించుకుంటున్నారట. వారికేం సమాధానం చెబుతారో చూసుకోండి.
ఇక పెద్ద కాలేజీలను బెదిరిస్తే చిన్న కాలేజీలు కూడా దారిలోకి వస్తాయని ఆయన వ్యూహంగా కనిపిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విషయమై కొన్ని కాలేజీల యాజమాన్యాల నుంచి ఎమ్మెల్సీపై ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా అందాయట. దీనిపై నిఘా వర్గాలు వివరాలు సేకరించే పనిలో పడ్డాయని తెలుస్తోంది.












