గృహ, వాహన, పర్సనల్ లోన్స్ తీసుకున్న వారికి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుభవార్త చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరం కూడా రెపోరేటును యథాతథంగా ఉంచుతున్నట్టు ప్రకటించింది. ఫలితంగా వడ్డీ రేట్లు ఇప్పుడున్న ప్రకారమే కొనసాగనుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆర్బీఐ రెపోరేటును సమీక్షించే విషయం తెలిసిందే. దేశఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రెపోరేటు రిజర్వు బ్యాంకు సమీక్షిస్తుంటుంది.అయితే, తాజా నిర్ణయంతో రుణగ్రహితలకు ఎంతో మేలు కలగనుంది.
ఎందుకంటే దేశంలో నానాటికీ ధరలు పెరుగుతూ పోతున్నాయి.ద్రవ్యోల్బణం భారంగా మారుతోంది. తాజా ఆర్బీఐ నిర్ణయంతో సామాన్యులకు బిగ్ రిలీఫ్ కలగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) ద్వైమాసిక సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తాజాగా వెల్లడించారు.
ప్రామాణిక వడ్డీ రేటుగా చెప్పబడే రెపో రేటును 5.25 శాతం వద్దే యథాతథంగా ఉంచాలని గవర్నర్ నేతృత్వంలోని ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించింది అని పేర్కొన్నారు. కాగా, ఆర్‌బీఐ బ్యాంక్‌లకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే బెంచ్‌మార్క్ రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకుండా 5.25 శాతం వద్దే కొనసాగించింది. వడ్డీ రేట్లను పెంచకపోవడంతో హోమ్ లోన్లు, ఆటో లోన్లు, పర్సనల్ లోన్లు తీసుకున్న వారి నెలవారీ ఈఎంఐలు పెరిగే అవకాశం లేదు.
భవిష్యత్ పరిస్థితులు, ధరల స్థిరత్వాన్ని బట్టి నిర్ణయం తీసుకునేలా ఆర్‌బీఐ తన విధాన వైఖరిని తటస్థంగానే పునరుద్ఘాటించింది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక పరిస్థితుుల, రాజకీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల హెచ్చుతగ్గుల మధ్య ఆర్థికవ్యవస్థను స్థిరంగా ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ స్పష్టంచేశారు.












