మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో తీవ్రవిషాదం నెలకొన్నది. అక్కడి పారిశ్రామిక వాడలో ఇవాళ తెల్లవారు జామున ప్రమాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. ఓ ఫ్యాక్టరీలో విషపూరత రసాయనం లీక్ అవ్వడంతో ముగ్గురు కార్మికులు మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్రంలో యాద్గిర్ జిల్లాలో ఈ ఘటన వెలుగుచూడగా.. కడేచూరు-బాడియాల పారిశ్రామిక వాడలోని ఓ పరిశ్రమలో వేకువజామున రసాయన వాయువు లీకైనట్టు గుర్తించారు. విషవాయువును పీల్చిన ముగ్గురు కార్మికులు ఊపిరాడక మృతి చెందగా..అందులో ఒకరు తెలంగాణకు చెందిన కార్మికుడిగా గుర్తించారు.
రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా కృష్ణ మండలం ఆలంపల్లికి చెందిన గణేశ్ అక్కడే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అతనితో పాటు మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాకు చెందిన విక్రమ్, సంజయ్‌లు కూడా మృతుల్లో ఉన్నారు. వీరంతా 20 నుంచి 25 ఏళ్లలోపు యువకులే అని తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఆంధ్రా రాష్ట్రం అనంతపురం జిల్లాకు చెందిన హేమంత్, శివకుమార్‌లను మెరుగైన వైద్యం కోసం రాయచూర్ ఆసుపత్రికి (రిమ్స్) తరలించినట్టు తెలుస్తోంది. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలిసింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి వెళ్లి విచారణ చేపట్టారు. అర్ధరాత్రి 1 నుంచి 2 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు యాద్గిర్ ఎస్పీ పృథ్విక్ శంకర్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఏ రసాయనం లీకైంది? అసలు ప్రమాదానికి గల కారణాలు ఏమిటి? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.












