తెలంగాణ

ఒకప్పుడు హాట్‌కేక్.. ఇప్పుడు ఖాళీ సీట్లు..! కంప్యూటర్ సైన్స్‌కు ఏమైంది..? ఉన్నత విద్యలో కొత్త ట్రెండ్ మొదలైందా?

రచన: Kashi7 నిమిషాల పఠనం

కోడింగ్, టెస్టింగ్, డాక్యుమెంటేషన్ వంటి అనేక పనులను ఇప్పుడు AI టూల్స్ వేగంగా పూర్తి చేస్తున్నాయి. దీంతో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలపై ప్రభావం పడుతుందనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఈ పరిస్థితులు విద్యార్థులు, తల్లిదండ్రులను కూడా ఆలోచింపజేస్తున్నాయి. కేవలం కంప్యూటర్ సైన్స్ ఒక్కటే భవిష్యత్తు కాదనే భావన క్రమంగా పెరుగుతోంది.

ఇంజినీరింగ్ విద్య‌లో స‌రికొత్త ట్రెండ్

భారీగా మిగిలిపోయిన సీఎస్ఈ సీట్లు

విద్యార్థుల ఆలోచ‌న ధోర‌ణిలో మార్పు..!

కంప్యూట‌ర్ సైన్స్ ఫ్యూచ‌రేంటి..?

ఒకప్పుడు ఇంజినీరింగ్‌లో సీటు కావాలంటే కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ బ్రాంచే కావాలని విద్యార్థులు, తల్లిదండ్రులు పోటీ పడేవారు. సీట్లు దొరకకపోతే లక్షల రూపాయలు ఫీజులు చెల్లించి ప్రైవేట్ కళాశాలల్లో చేరేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. ఈ ఏడాది ఎప్‌సెట్ కౌన్సెలింగ్ ఫలితాలు చూస్తే.. ఒకప్పుడు అత్యంత డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత కోర్సుల్లోనే వేల సంఖ్యలో సీట్లు మిగిలిపోవడం ఉన్నత విద్యలో వస్తున్న మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది.

ఈ ఏడాది కన్వీనర్ కోటా కింద కంప్యూటర్ సైన్స్, ఐటీకి సంబంధించిన 19 బ్రాంచీల్లో మొత్తం 66,390 సీట్లు అందుబాటులో ఉండగా 54,730 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే 11,660 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. ఒకప్పుడు సీఎస్‌ఈ సీటు దొరికిందంటే భవిష్యత్తు సెట్ అనే భావన ఉండేది. ఇప్పుడు అదే బ్రాంచీలో ఇంత భారీ సంఖ్యలో సీట్లు ఖాళీగా ఉండటం విద్యార్థుల ఆలోచనల్లో మార్పు వచ్చిందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

ఐటీ సెక్టార్ ఢ‌మాల్..!

ఈ మార్పుకు ప్రధాన కారణం ఐటీ రంగంలో గత రెండు మూడేళ్లుగా చోటుచేసుకున్న పరిణామాలేనని విద్యావేత్తలు చెబుతున్నారు. ఒకప్పుడు క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో వేలాది ఉద్యోగాలు ఇచ్చిన పెద్ద ఐటీ కంపెనీలు ఇప్పుడు నియామకాలను గణనీయంగా తగ్గించాయి. కొన్ని సంస్థలు హైరింగ్‌ను వాయిదా వేయగా, మరికొన్ని ఉద్యోగుల సంఖ్యను తగ్గించాయి. దీంతో కంప్యూటర్ సైన్స్ చదివితే ఉద్యోగం ఖాయం అనే నమ్మకం గతంతో పోలిస్తే బలహీనపడింది.

ఇక మరో కీలక కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI). కోడింగ్, టెస్టింగ్, డాక్యుమెంటేషన్ వంటి అనేక పనులను ఇప్పుడు AI టూల్స్ వేగంగా పూర్తి చేస్తున్నాయి. దీంతో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలపై ప్రభావం పడుతుందనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఈ పరిస్థితులు విద్యార్థులు, తల్లిదండ్రులను కూడా ఆలోచింపజేస్తున్నాయి. కేవలం కంప్యూటర్ సైన్స్ ఒక్కటే భవిష్యత్తు కాదనే భావన క్రమంగా పెరుగుతోంది.

అయితే కంప్యూటర్ సైన్స్‌కు డిమాండ్ పూర్తిగా తగ్గిపోయిందని చెప్పడం కూడా సరైంది కాదు. దేశంలోని ప్రముఖ ఐఐటీలు, ఎన్‌ఐటీలు, టాప్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికీ కంప్యూటర్ సైన్స్‌కు భారీ పోటీ ఉంది. కానీ సాధారణ ఇంజినీరింగ్ కళాశాలల్లో మాత్రం విద్యార్థులు కళాశాల నాణ్యత, ప్లేస్‌మెంట్లు, ఫ్యాకల్టీ, పరిశ్రమలతో అనుసంధానం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు.

ఐటీ టు చిప్ డిజైన్

ఇప్పుడు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సెమీకండక్టర్లు, చిప్ డిజైన్, రోబోటిక్స్, ఆటోమేషన్, డేటా సెంటర్లు, డిఫెన్స్ తయారీ, డ్రోన్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో కొత్త అవకాశాలు పెరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తయారీ రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను విస్తరించడం వల్ల ఈ విభాగాలపై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.

అయితే సంప్రదాయ కోర్సులైన సివిల్, మెకానికల్ పూర్తిగా పుంజుకున్నాయా అంటే ఇప్పుడే అలా చెప్పలేం. ఈ ఏడాది కూడా ఆ బ్రాంచీల్లో సీట్ల భర్తీ శాతం 70 శాతానికి లోపే ఉంది. కానీ గతంతో పోలిస్తే ఈ కోర్సులపై నిర్లక్ష్య ధోరణి కొంత తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. మౌలిక వసతుల నిర్మాణం, రైల్వేలు, రక్షణ రంగం, తయారీ పరిశ్రమల్లో పెట్టుబడులు పెరగడం వల్ల భవిష్యత్తులో ఈ కోర్సులకు కూడా కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ ఏడాది ఎప్‌సెట్ కౌన్సెలింగ్‌లో మొత్తం 94,156 సీట్లు అందుబాటులో ఉండగా 75,054 సీట్లు మాత్రమే భర్తీ కావడం, దాదాపు 19 వేల సీట్లు ఖాళీగా మిగలడం కూడా మరో ముఖ్యమైన సంకేతం. ఇంజినీరింగ్ మాత్రమే కాకుండా డిగ్రీలు, ఇంటిగ్రేటెడ్ కోర్సులు, విదేశీ విద్య, స్కిల్ ఆధారిత ప్రోగ్రామ్‌లు, ఆన్‌లైన్ సర్టిఫికేషన్‌లు, స్టార్టప్ అవకాశాల వైపు కూడా యువత దృష్టి మళ్లుతోంది. దీంతో ఇంజినీరింగ్ సీట్ల కోసం ఒకప్పుడు కనిపించిన పోటీ ఇప్పుడు క్రమంగా తగ్గుతోంది. ఉన్నత విద్యలో ప్రారంభమైన ఈ కొత్త ధోరణి రాబోయే సంవత్సరాల్లో ఇంజినీరింగ్ అడ్మిషన్ల స్వరూపాన్నే మార్చే అవకాశం ఉందని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

#Engineering Admissions 2026#TS EAPCET#Engineering Colleges#CSE Seats#Computer Science#IT Courses#AI Impact#Artificial Intelligence#IT Jobs#Engineering Trends#Higher Education#Career Trends#Semiconductor#Chip Design#Robotics#Electronics Engineering#Engineering News#Telangana Education
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి