Charminar Set: మన హైదరాబాద్ చారిత్రాత్మక కట్టడాలలో చార్మినార్ కి ఓ ప్రత్యేకత ఉంది. ఎవరు ఎక్కడ నుంచి హైదరాబాద్ వచ్చినా చార్మినార్ చూడకుండా వెను తిరిగింది లేదు. సుమారు 400 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ ప్రదేశంలో ఒకప్పుడు విరివిగా షూటింగ్స్ జరిగేవి. అప్పట్లో, మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ సినిమాలోని సాంగ్ ఇక్కడ షూట్ చేశారు.
ఇలాంటి, చిత్రీకరణలు సినిమాల కోసం ఎన్నో జరిగాయి. అయితే, చార్మినార్ వద్ద ఇప్పుడు రోజుల తరబడి షూటింగ్స్ జరపడం కష్టంగా మారింది. పెద్ద స్టార్ హీరోల షూటింగ్ అంటే బందోబస్తూ, పర్మిషన్స్ ఇలా నానా హంగామా ఉంటుంది. అందుకే, గత కొంత కాలంగా ఇక్కడ షూటింగ్స్ జరగడం లేదు. అయితే, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఇండస్ట్రీ హిట్ ఒక్కడు కోసం భారీ ఎత్తున ఖర్చు చేసి గోపన పల్లెలో చార్మినార్ సెట్ వేశారు. ఈ సెట్ కూడా కథలో కీలక పాత్ర పోహించింది.
మళ్ళీ, ఇన్నాళ్ళకు అలాంటి సెట్ ని ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ కోసం నిర్మించినట్టుగా మైత్రీ నిర్మాతలలో ఒకరైన యలమంచిలి రవిశంకర్ రివీల్ చేశాడు. ఆగస్టు మొత్తం ఫౌజీ షెడ్యూల్స్ ఎలా, ఎక్కడెక్కడ జరగబోతున్నాయో వెల్లడించాడు. ప్రస్తుతం, హైదరాబాద్ కోకాపేటలో వేసిన భారీ టెంపుల్ సెట్‌లో యాక్షన్ సీక్వెన్సెస్ ని షూట్ చేస్తున్నారు. ప్రభాస్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ లపై ఈ ఫైట్ సీక్వెన్సెస్ ని హను రాఘవపూడి చిత్రీకరిస్తున్నాడు.
దీని తర్వాత ఆగస్టు 8 నుంచి 13వ తేదీ వరకూ అల్యూమియం ఫ్యాక్టరీలో వేసిన చార్మినార్ సెట్ లో చిత్రీకరణ జరపనున్నారు. ఆ తర్వాత, రామోజీ ఫిలిం సిటీలో ఈ నెల 26వ తేదీ వరకూ చిత్రీకరణ జగనుంది. దీంతో, 90 శాతం ఫౌజీ షూటింగ్ కంప్లీట్ అవుతుందని రవిశంకర్ తెలిపాడు. ఆల్రెడీ సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ రీ రికార్డింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేశాడు. ఇమాన్వీ ఇందులో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెకిది మొదటి సినిమా.












