చాలామంది శివుడి ఆలయానికి వెళ్లినప్పుడు ఉద్యోగం, డబ్బు, ఆరోగ్యం, కుటుంబ సుఖం వంటి కోరికలను కోరుకుంటారు. అయితే శైవాగమాలు, ఉపనిషత్తులు, యోగశాస్త్రాలు చెప్పే అసలైన ప్రార్థన మాత్రం దీనికి భిన్నంగా ఉంటుంది. పరమశివుడిని భౌతిక కోరికల కోసం కాకుండా, ఆత్మజ్ఞానం, వైరాగ్యం, భక్తి, ధర్మమార్గంలో నడిపించే దివ్యశక్తి కోసం ప్రార్థించాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు.
మన శరీరాన్ని ఒక రథంగా, మన కర్మలను ఆ రథాన్ని నడిపించే పగ్గాలుగా భావిస్తారు. ఈ రథానికి నిజమైన సారథి పరమశివుడే కావాలని ప్రార్థించడం అత్యున్నత భక్తి.. మహాదేవా... నా ఈ శరీరమనే రథానికి నీవే సారథివై ఉండు. నా కర్మ అనే పగ్గాలను నీ చేతుల్లోకి తీసుకుని ధర్మమార్గంలో నడిపించు అనే ప్రార్థనలో జీవిత సారాంశం దాగి ఉంది. లోకాలను పాలించే లోకపాలకుడు మన హృదయంలో ఉన్నప్పుడు భయం, చింత, అస్థిరతకు చోటు ఉండదని శైవతత్వం వివరిస్తుంది.
ఇక ఈ ప్రపంచంలో మనిషి ఎక్కువగా ఆకర్షితుడయ్యేది బాహ్య సౌందర్యానికే.. అయితే ఈ యవ్వనం, అందం, శరీర బలం అన్నీ కాలక్రమంలో మారిపోతాయి. ఒకప్పుడు గర్వకారణమైన శరీరమే వృద్ధాప్యంలో బలహీనమవుతుంది. అందుకే మహాదేవా.. నశించే రూప సౌందర్యం కాదు.. ఎన్నటికీ వాడిపోని ఆత్మ సౌందర్యాన్ని ప్రసాదించు. అహంకారం, మోహం, మాయ అనే పొరలను తొలగించి నీ తత్వాన్ని గ్రహించే జ్ఞానాన్ని అనుగ్రహించు... అంటూ శివుడిని ఇలా ప్రార్థించాలని ఆధ్యాత్మిక గ్రంథాలు సూచిస్తాయి..
శాస్త్రాల ప్రకారం పరమాత్మ జీవాత్మకు శాశ్వత మిత్రుడు. ఆయన ఎప్పటికీ తన భక్తుడిని విడిచిపెట్టడు. భక్తి, జ్ఞానం, ధ్యానం, క్రియాయోగం వంటి మార్గాల ద్వారా పరమాత్మను చేరుకోవచ్చని యోగశాస్త్రం చెబుతోంది. సహస్రార చక్రంలో దివ్యచైతన్యాన్ని అనుభవించినప్పుడు జనన–మరణ చక్రం నుంచి విముక్తి లభిస్తుందని యోగవేదాంతం వివరిస్తుంది. మరోవైపు మనిషి చేసే ప్రతి కర్మకు ఫలితం తప్పనిసరిగా ఉంటుంది.
పుణ్యకర్మలు ఉన్నత స్థితికి చేర్చితే, అధర్మకర్మలు దిగజార్చుతాయి. మిశ్రిత కర్మల వల్లే మానవ జన్మ లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటాయి. అందుకే ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి కార్యం ధర్మబద్ధంగా ఉండాలని మహర్షులు ఉపదేశించారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, నష్టాలు, అవమానాలు, విజయాలు... ఇవన్నీ మనిషిని పరిపక్వుడిని చేసే పాఠాలే. అనుభవం లేకుండా జ్ఞానం రాదు. పరీక్షలు లేకుండా సహనం పెరగదు. బాధలను అధిగమించినప్పుడే ఆత్మబలం పెరుగుతుంది.
అందుకే ప్రతి సంఘటనను శివుని ప్రసాదంగా స్వీకరించి, దాని నుంచి జీవిత పాఠాన్ని నేర్చుకోవాలని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు. శివుడి వద్ద ధనం, అధికారం, ఐశ్వర్యం కంటే ముందుగా మంచి బుద్ధి, భక్తి, వినయం, వైరాగ్యం, ధర్మమార్గంలో నడిచే శక్తిని కోరుకోవాలి. ఆత్మను శుద్ధి చేసే జ్ఞానం, కర్మలను పవిత్రం చేసే సంకల్పం, చివరి శ్వాస వరకు శివనామాన్ని స్మరించే భక్తిని ప్రసాదించమని ప్రార్థించాలి. ఎందుకంటే.. శివానుగ్రహం లభించిన చోట భయం ఉండదు. మోహం ఉండదు. చింత ఉండదు. అక్కడ ఉండేది కేవలం శాంతి, జ్ఞానం, ముక్తికి దారితీసే దివ్యప్రకాశమే అని పండితులు చెబుతున్నారు..
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.












