- రోడ్డు కోసం బౌరంపేట్‌లో రూ.25 కోట్ల ప్రభుత్వ భూమి హాంఫట్?
- ఎన్ని ఫిర్యాదులు చేసినా సీఎం ఫ్రెండ్ చెప్పారని నోరెత్తని అధికారులు?
- రాయల్ విలేజ్ విల్లాల దారి కోసం మున్సిపాలిటీకి హ్యాండోవర్ చేసినా
- సెప్టిక్ ట్యాంక్ కబ్జా, డ్రైనేజ్ అంతా చెరువులోకి కలిపిన ఘనుడు
- ప్రగతి నగర్‌లో తీసుకున్న అనుమతులకు మించి నిర్మాణాలు?
- ఏ ప్రాజెక్ట్ చూసినా ఏదో ఒక లిటిగేషనే.. కొనుగోలుదారులు జర భద్రం
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
9848070809
రాయల్ విలేజ్ కోసం సెప్టిక్ ట్యాంక్‌ను వదలని రుద్ర కన్‌స్ట్రక్షన్?
దుండిగల్ గ్రామంలో దారి లేని 7 ఎకరాల్లో రాయల్ విల్లా ప్రాజెక్ట్ ప్రారంభించాలని అనుకుంటున్నారు. 30 ఎకరాల్లోని విశ్వసాయి టౌన్ షిప్ లోనుంచి ఉన్న దారిని వాడుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదు. సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం కోసం ఉంచుకున్న భూమిని దారిగా చూపిస్తూ అనుమతులు తీసుకున్నారు.
పబ్లిక్ యూజ్ కోసం కేటాయించిన మొత్తం 9,404 చదరపు గజాల భూమిని ఆర్ఆర్ డెవలపర్స్ వెంచర్స్ సంస్థ నిబంధనల ప్రకారం రోడ్లు, బహిరంగ ప్రదేశాలు, సెప్టిక్ ట్యాంక్ ప్రాంతం కోసం దుండిగల్ మున్సిపాలిటీకి గిప్ట్ సెటిల్మెంట్ డీడ్(డాక్యుమెంట్ నెంబర్ 32001/2022) చేశారు. దీన్ని ఓవర్ రైడ్ చేస్తూ, ఓనర్స్ ఒప్పుకున్నారని టౌన్ షిప్‌లోని కొంతమందితో 2025 మే 24న ఎంవోయూ చేయించుకుని కబ్జా చేశారు.
అయితే అనుమతుల కోసం హెచ్ఎండీఏకు తెలియజేయకుండానే పర్మిషన్స్ తెచ్చుకున్నారు. డ్రైనేజీని చెరువులోకి కలపడంతో ఈ విషయం బయటకు పొక్కింది. అనుమతులు రద్దు చేసి మరో చోట నుంచి రోడ్డు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదులు చేశారు. దీంతో అధికారులు చెరువులోకి వదిలిన డ్రైనేజ్ పైపులను పగలగొట్టేందుకు సిద్ధమయ్యారు.
బౌరంపేట్‌లో బరితెగించిన ఆశోక రుద్ర?.. సీఎం ఫ్రెండ్ చెప్పారని అంతా గప్‌చుప్?
దుండిగల్ మున్సిపాలిటీలోని బౌరంపేట్ గ్రామంలో మరో విల్లా ప్రాజెక్ట్ నిర్మించేందుకు రుద్ర కన్‌స్ట్రక్షన్ ప్రారంభించింది. అయితే దీనికి బౌరంపేట్ గ్రామం నుంచి 40 ఫీట్ల రోడ్డు మాత్రమే ఉంది. ఇలా అయితే ప్రాజెక్ట్ ముందుకు సాగదని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు నుంచి 50 ఫీట్లు ప్రైవేట్‌గా రోడ్డు నిర్మాణం చేసుకున్నారు. దీనిపై స్థానిక బీజేపీ రెబల్ నేత ఆకుల సతీష్ ఎన్నో ఫిర్యాదులు చేశారు. స్థానిక ఎమ్మెల్సీ ఈ అక్రమంపై మండలిలో సైతం మాట్లాడారు. చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు వివరణ ఇచ్చారు.
కానీ ఎవరూ ఎమీ చేయలేని పరిస్థితిగా మారిపోయింది. రూ.25 కోట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డు నిర్మాణం చేశారు. అందుకు అశోక బిల్డర్స్ భాస్కర్ రెడ్డి పెద్ద ఎత్తున అధికారులపై ఒత్తిడి తేవడంతో సర్వే(సర్వే నెంబర్ 166/1)చేసి ప్రభుత్వ భూమి 166/3లోని ఎన్వోసీ లేని ఫ్రీడం పైటర్ భూమి మొత్తం 1.16 గుంటలు కబ్జా చేసి నిర్మాణం చేశారని ఆర్టీఐ ద్వారా రెవెన్యూ అధికారులు వివరణ ఇచ్చారు.
ప్రభుత్వ భూమి నుంచి రహదారి కావాలంటే కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇవ్వాలి, మాస్టర్ ప్లాన్‌లో రోడ్డును మార్చి వెంచర్‌కు నేరుగా వేసుకోవడంతో ఎన్నో విమర్శలు వచ్చాయి. అధికారులకు ఆయన ఫోన్ చేశారని దాన్ని ముట్టుకోవద్దని చెప్పడంతో అక్కడే అగిపోయింది.
బాచుపల్లిలో బాజాప్తాగా అనుమతుల అతిక్రమణ
సర్వే నెంబర్ 135, 136లో 1,274 గజాల్లో హెచ్ఎండీఏ నుంచి అనుమతులు తీసుకొని నిర్మాణం చేపట్టారు. మూడు దిక్కులా రోడ్డు ఉండటంతో చుట్టూ 6 మీటర్లు, ముందు భాగంలో 10 మీటర్ల ఖాళీ స్థలం సెట్ బ్యాక్ తీసుకుని నిర్మాణం చేయాలని అనుమతుల్లో ఉంది. కానీ ఫుట్‌పాత్ వరకు, రహదారిని ఆక్రమించుకునేలా పూర్తిగా మార్చేశారు. దీంతో ఫిర్యాదులు వెళ్లాయి.
అధికారులు షోకాజ్ నోటీసులు అందజేశారు. హైకోర్టుకు వెళ్లినా ఉపశమనం లేకపోవడంతో అధికారులు బిల్డింగ్‌ను సీజ్ చేశారు. ఇక్కడ కూడా రోడ్డుకు సెట్ బ్యాక్ వదలలేదు. ఇలా రహదారుల పేర్లతో రుద్ర చేస్తున్న అక్రమాలను ఇకనైనా మానుకుని ఎవరూ వేలెత్తి చూపకుండా కొనుగోలుదారులకు తర్వాత ఇబ్బందులు లేకుండా ఓసీలు వచ్చేలా వ్యవహరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వివిధ అక్రమాలపై ఫిర్యాదులు కూడా చేస్తున్నారు.












