మన పురాణాల్లో చిరంజీవులు అనే పదానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. "చిరం" అంటే దీర్ఘకాలం, "జీవి" అంటే జీవించి ఉండేవాడు. అంటే యుగాలు మారినా, ధర్మ పరిరక్షణ కోసం దైవ సంకల్పంతో భూమిపై లేదా లోకాలలో తమ ఉనికిని కొనసాగిస్తున్న మహనీయులను చిరంజీవులు అంటారు.
శాస్త్రాల ప్రకారం ఏడుగురు చిరంజీవులు ఉన్నారు. వారే అశ్వత్థామ, మహాబలి చక్రవర్తి, వేదవ్యాస మహర్షి, ఆంజనేయ స్వామి, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు అని చెబుతారు.. ఇక అశ్వత్థామ మహాభారత యుద్ధానికి సాక్షి. అతని జీవితం అహంకారం, కోపం మనిషిని ఎలా పతనానికి గురిచేస్తాయో తెలియజేసే గొప్ప గుణపాఠంగా పేర్కొంటారు.
మహాబలి చక్రవర్తి సత్యనిష్ఠకు, దానగుణానికి ప్రతీక. వామనావతారంలో సర్వస్వాన్ని సమర్పించిన అతనికి మహావిష్ణువు అమరత్వ వరం ప్రసాదించాడని పండితులు వివరిస్తారు. అలాగే వేదవ్యాస మహర్షి వేదాలను విభజించి, మహాభారతం, భాగవతం వంటి మహాగ్రంథాలను రచించిన జగద్గురు. ఆయన జ్ఞానానికి చిరస్థాయిగా నిలిచిన ప్రతిరూపం అంటారు..
అదేవిధంగా భక్తి, బలం, వినయానికి ప్రతీక హనుమంతుడని, శ్రీరాముని నామస్మరణ ఉన్న ప్రతి చోట ఆంజనేయుడు ఉంటాడని విశ్వాసం. భక్తులను కష్టాల నుంచి కాపాడే చిరంజీవిగా ఆయనను ఆరాధిస్తారు.. విభీషణుడు ధర్మం కోసం సొంత అన్నను కూడా ఎదిరించిన మహాత్ముడని రామాయణ గాధ చెబుతుంది. అధర్మాన్ని విడిచి సత్యాన్ని ఆశ్రయించినవారికి దైవానుగ్రహం ఎలా లభిస్తుందో తెలియడానికి ఆయన జీవితం ఒక ఉదాహరణగా పండితులు పేర్కొంటారు.
అలాగే కృపాచార్యుడు మహాభారత కాలంలోని గొప్ప గురువు. జ్ఞానం, క్రమశిక్షణ, గురుభక్తికి ప్రతీకగా చిరంజీవిగా నిలిచారు. మరోవైపు పరశురాముడు శ్రీమహావిష్ణువు ఆరవ అవతారం. అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని స్థాపించిన మహాయోగిగా, భవిష్యత్తులో కల్కి అవతారానికి గురువుగా ఉంటారని పురాణాలు పేర్కొంటాయి. ఇవే కాకుండా మార్కండేయ మహర్షిని కూడా అనేక సంప్రదాయాలు అష్టమ చిరంజీవిగా స్మరిస్తాయి. పరమశివుని అనుగ్రహంతో మృత్యువునే జయించిన మహాభక్తుడిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది.
ఇక ప్రతిరోజూ ఈ చిరంజీవులను భక్తిశ్రద్ధలతో స్మరిస్తే ఆయురారోగ్యాలు, ధైర్యం, జ్ఞానం, భక్తి, సత్యనిష్ఠ, ధర్మబుద్ధి పెరుగుతాయని శాస్త్ర విశ్వాసం. మార్కండేయ మహర్షిని స్మరించడం వల్ల మృత్యుభయం తొలగి, పరమేశ్వరుని కరుణ లభిస్తుందని పురాణాలు వివరిస్తాయి. అయితే ఈ స్మరణ కేవలం దీర్ఘాయుష్షు కోసం మాత్రమే కాదు. వారి జీవితాల్లోని గొప్ప గుణాలను మన జీవితంలో ఆచరించడమే అసలైన ఆధ్యాత్మిక సందేశం. ధర్మం, భక్తి, సత్యం, వినయం, గురుభక్తి, దానగుణం... ఈ విలువలను అనుసరించినప్పుడే చిరంజీవుల స్మరణకు సంపూర్ణ ఫలితం లభిస్తుందని మన సనాతన ధర్మం బోధిస్తోంది.
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.












