National

Supreme Court: సైబర్ మోసాలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆర్బీఐకి కీలక ఆదేశాలు!

రచన: Venu4 నిమిషాల పఠనం

ఆర్థిక మోసాలతో పాటు సైబర్‌ నేరాలపై కఠిన చర్యలు తీసుకునేలా ఆయా వ్యవస్థలను బలోపేతం చేయాలనీ సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్‌ వి.మోహన ధర్మాసనం పేర్కొంది.

దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిజిటల్, సైబర్ మోసాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలను మోసం చేస్తున్న బ్యాంక్ ఖాతాలు, మ్యూల్ అకౌంట్లపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రామాణిక మార్గదర్శకాలను నాలుగు వారాల్లో సిద్ధం చేసి అమలు చేయాలని ఆర్బీఐని ఆదేశించింది. ఆ నిబంధనలను దేశంలోని అన్ని హైకోర్టులకు కూడా పంపించాలని స్పష్టం చేసింది.

మరోవైపు ఆర్థిక మోసాలతో పాటు సైబర్‌ నేరాలపై కఠిన చర్యలు తీసుకునేలా ఆయా వ్యవస్థలను బలోపేతం చేయాలనీ సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్‌ వి.మోహన ధర్మాసనం పేర్కొంది. అలాగే దర్యాప్తు సంస్థలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ విభాగాలూ ఇలాంటి కేసుల విషయంలో చురుగ్గా వ్యవహరించడంతో పాటు బాధితులకు న్యాయంచేయాలని, వారు కోల్పోయిన డబ్బును తిరిగి వచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించింది.

సుప్రీంకోర్టు సుమోటోగా చేపట్టిన డిజిటల్‌ అరెస్టులు, నకిలీ పత్రాల బాధితులు కేసు విచారణలో భాగంగా ధర్మాసనం ఈ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి సమర్పించిన నివేదికలపై సంతృప్తి వ్యక్తం చేసింది. సైబర్‌నేరాల కట్టడి చర్యల్లో పురోగతి ప్రశంసనీయమని తెలిపింది. సైబర్ నేరాలను అరికట్టే వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని, వాటి పనితీరును వేగవంతం చేయాలని, అలాగే అవి సమర్థంగా పనిచేస్తున్నాయో లేదో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

కేంద్ర హోంశాఖ పరిధిలో నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చి గ్రీవెన్స్‌ రిడ్రెస్సల్‌ మాడ్యూల్‌, మనీ రెస్టోరేషన్‌ మాడ్యూల్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొన్న ధర్మాసనం.. వీటి గురించి ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలని, అదేవిధంగా బాధితులు సత్వర న్యాయంపొందేలా చూడాలని పేర్కొంది. మరోవైపు 18రాష్ట్రాలు మాత్రమే స్టేట్‌ సైబర్‌ కోఆర్డినేషన్‌ సెంటర్స్‌ ఏర్పాటు, ఈ-జీరో ఎఫ్‌ఐఆర్‌ల నమోదు విషయంలో చర్యలు తీసుకున్నాయని ధర్మాసనం తెలిపింది.

#National#Supreme Court#serious#cyber#fraud#RBI
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి