తెలంగాణ

Telangana: ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానించొద్దు.. సీఎంపై అర్వింద్ ఫైర్!

రచన: Venu6 నిమిషాల పఠనం

సీఎం వ్యక్తిగత సామర్థ్యం నుంచి విద్యాశాఖ నిర్వహణ, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి, పెట్టుబడుల వాతావరణం, హైడ్రా చర్యల వరకు పలు అంశాలపై అర్వింద్ ప్రశ్నలు సంధించారు. ఇతరుల సహాయం లేకుండా ఎన్నికల నామినేషన్ పత్రం కూడా నింపలేని వ్యక్తి ఇంజనీరింగ్, గ్రాడ్యుయేట్ విద్యార్థుల గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హిట్ ఎక్కుతుంది. కాంగ్రెస్-బీఆర్ఎస్-బిజెపి పార్టీలు ఒకరి మీద ఒకరు విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడటం కనిపిస్తుంది. ఈ క్రమంలో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇంజనీరింగ్ విద్యార్థులపై సీఎం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. అవి రాష్ట్ర యువత భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపేలా ఉన్నాయని ఆరోపించారు.

సీఎం వ్యక్తిగత సామర్థ్యం నుంచి విద్యాశాఖ నిర్వహణ, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి, పెట్టుబడుల వాతావరణం, హైడ్రా చర్యల వరకు పలు అంశాలపై అర్వింద్ ప్రశ్నలు సంధించారు. ఇతరుల సహాయం లేకుండా ఎన్నికల నామినేషన్ పత్రం కూడా నింపలేని వ్యక్తి ఇంజనీరింగ్, గ్రాడ్యుయేట్ విద్యార్థుల గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు.

రెండో వ్యక్తి సహాయం లేకుండా నామినేషన్ పత్రం నింపగలరా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. చదువు లేని వ్యక్తి వద్ద విద్యాశాఖ ఉండటం సమంజసం కాదని, ఆ శాఖను చదువుకున్న నాయకుడైన మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగించాలని సూచించారు. మరోవైపు 65 శాతం హాజరుతో పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన ఇంజనీరింగ్ విద్యార్థులకు దరఖాస్తు ఫారాలు కూడా నింపడం రాదని సీఎం మాట్లాడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

దేశంలోనే అత్యధిక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు ఉందని, అలాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్.. ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు విద్యార్థుల ప్రతిభపై అనుమానాలు కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు. సీఎం ఈ రకంగా మాట్లాడితే మన రాష్ట్ర ఇంజనీరింగ్ పిల్లలకు ఎవరైనా ఉద్యోగాలు ఇస్తారా? అని ప్రశ్నించారు. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పరిస్థితి ఇప్పుడు ఏంటని మండిపడ్డారు.

ఇప్పటికే ఉద్యోగాల కోసం పోటీ తీవ్రంగా ఉన్న సమయంలో ప్రభుత్వం యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాల్సింది పోయి, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికీ మౌలిక వసతుల కొరత ఉందని అర్వింద్ ఆరోపించారు. ఆడపిల్లలకు మరుగుదొడ్లు లేని పాఠశాలలు ఉన్నాయని, ఉపాధ్యాయులకు పీఆర్సీ కూడా అమలు కాలేదని గుర్తు చేశారు.

ఇప్పటికే ఉన్న పాఠశాలలను అభివృద్ధి చేయకుండా కొత్త భవనాల పేరుతో రేవంత్ ప్రభుత్వం కమిషన్ల రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. అదేవిధంగా రాష్ట్రం గురించి తప్పుడు మాటలు మాట్లాడితే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ఎలా ముందుకు వస్తారని అర్వింద్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు.

మరోవైపు హైడ్రా చర్యల కారణంగా రియల్ ఎస్టేట్ రంగం తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందని, కోర్టుల నుంచి కూడా ప్రభుత్వానికి చీవాట్లు పడుతున్నాయని, అయినా ప్రభుత్వ విధానంలో మార్పు రాకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఇక ప్రభుత్వం మాత్రం విద్యా రంగంలో సంస్కరణలు, నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. కానీ అవి మాటలకే పరిమితం అయ్యాయని అరవింద్ ఆరోపించారు.

#Telangana#political#engineering students#CM Revanth Reddy#Dharmapuri Arvind#BJP
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి