Pocso Case: తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదైంది. బాలికను లైంగికంగా వేధించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదుతో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదవడంతో పృథ్వీశ్వర్ రెడ్డి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
గత నెల 24న అతడిపై కేసు నమోదైంది. అప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నాడని, రంగారెడ్డి జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. పోక్సో కేసు బయటకు రాకుండా కొందరు పెద్దలు మ్యానేజ్ చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి. బాధితురాలి తల్లి మీడియాను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
బాధితురాలు ఒక ప్లేయర్. క్యాంప్‌లలో పృథ్వీశ్వర్ తనతో అసభ్యంగా, అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపించింది. క్యాంపుల పేరుతో సెలక్షన్ పేరుతో టోర్నమెంట్ల పేరుతో బయటికి పిలిచి తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని పృథ్వీశ్వర్ రెడ్డిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేధింపులు తాళలేక కొన్ని సెలక్షన్స్ కి, క్యాంపులకు కూడా తను వెళ్లలేకపోయానని బాధితురాలు వాపోయింది.
బాలిక మైనర్ కావడవడంతో పృథ్వీశ్వర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదైంది. కేసు నమోదై చాలా రోజులు అవుతున్నా పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతవరకు పృథ్వీశ్వర్ ని అరెస్ట్ చేయకపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












