తెలంగాణ

USPC పోరుబాట.. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై దశలవారీ పోరాటం

రచన: NK6 నిమిషాల పఠనం

ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యల పరిష్కారానికి దశలవారీ పోరాటం నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (USPC) నిర్ణయించింది. మంగళవారం టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో యుఎస్ పీసీ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో యుఎస్ పీసీ నాయకులు మాట్లాడారు. ఉపాధ్యాయ సమస్యలన్నీ విద్యారంగ సమస్యలేనని, వాటి పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

USPC Agitation: ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యల పరిష్కారానికి దశలవారీ పోరాటం నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (USPC) నిర్ణయించింది. మంగళవారం టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో యుఎస్ పీసీ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో యుఎస్ పీసీ నాయకులు మాట్లాడారు. ఉపాధ్యాయ సమస్యలన్నీ విద్యారంగ సమస్యలేనని, వాటి పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విద్యా శాఖ అధికారుల వైఖరి వల్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు క్రమంగా మూతపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా రంగానికి 15% నిధుల కేటాయింపు హామీని విస్మరించారని, నాణ్యమైన విద్య పేరుతో పాఠశాలల కుదింపునకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభిస్తున్నామని ఘనంగా ప్రకటించినప్పటికీ కేవలం యుకెజికే పరిమితం చేశారని, ప్రీ ప్రైమరీ తరగతులను మధ్యాహ్నం 12.00 గంటల వరకే నడపాలన్నారు. కానీ ప్రైవేటు పాఠశాలల్లో సాయంత్రం 4గంటల వరకు ప్రీ ప్రైమరీ తరగతులు నడుస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలలకు పంపితే మధ్యాహ్నం 12 తర్వాత పసి పిల్లలను ఎవరు చూసుకుంటారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారని అన్నారు.

ప్రాథమిక విద్యకు నష్టదాయకమైన జీవో 25ను సవరించాలని కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఇద్దరు టీచర్లు, 50 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో తరగతికి ఒక టీచర్ ను నియమించాలని డిమాండ్ చేశారు. నూతన జిల్లాలకు డీఈవో, రెవెన్యూ డివిజన్ కు ఒక డిప్యూటీ ఈవో, అన్ని మండలాలకు ఎంఈవో పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

పీవో 2018కి అనుగుణంగా సర్వీసు నిబంధనలు రూపొందించి పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని యుఎస్ పీసీ నాయకులు మండిపడ్డారు. ఆగస్టు 15 లోగా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని, టెట్ లో సర్వీసు వెయిటేజ్ ఇవ్వాలని, స్పెషల్ టెట్ ను సబ్జెక్ట్ వారీ పేపర్లతో నిర్వహించాలని డిమాండ్ చేశారు.

సీపీఎస్ రద్దు చేయాలని, మెమో 57 ప్రకారం 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ వర్తింపజేయాలని, విద్యాశాఖలో బీసీ, గిరిజన గురుకులాల టైం టేబుల్ మార్చాలని, మోడల్ స్కూల్స్ ను, ఎయిడెడ్ స్కూల్స్ ను విద్యాశాఖలో విలీనం చేయాలని, కెజిబివి, యుఆర్ఎస్, సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

జీవో 317 బాధితులకు న్యాయం చేయాలని, జీవో 190 అమలు చేయాలని, 5 వాయిదాల కరవు భత్యం (డిఎ)ను వెంటనే ప్రకటించాలని, పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను ప్రతి నెల రూ.2000 కోట్ల చొప్పున విడుదల చేయాలని, హెల్త్ కార్డులు పూర్తి స్థాయిలో అమలుకు చొరవ తీసుకోవాలని యుఎస్ పీసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

ఈ డిమాండ్ల పరిష్కారానికి దశలవారీ పోరాటాలు నిర్వహించాలని యుఎస్ పీసీ నిర్ణయించింది. ఆ మేరకు ఆగస్టు 7న నల్ల బ్యాడ్జీలతో పాఠశాలల్లో భోజన విరామ సమయంలో నిరసనలు చేపట్టనున్నారు. ఆ నాటి నుండి పీఆర్సీ ప్రకటించే దాకా ప్రతి రోజూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని పిలుపునిచ్చింది. ఆగస్టు 12,13 తేదీల్లో మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, తహసీల్దార్లకు మెమోరాండంలు, ఆగస్టు 19 నాడు జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, ఆగస్టు 29న హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించారు.

అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే సెప్టెంబర్ లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వేలాది మంది ఉపాధ్యాయులతో చలో అసెంబ్లీ నిర్వహిస్తామని యుఎస్ పీసీ నాయకులు ప్రకటించారు. అన్ని సంఘాలు ఐక్య పోరాటాలకు కలిసి రావాలని, ఉపాధ్యాయులందరూ సంఘాలకు అతీతంగా సమస్యల పరిష్కారం కోసం ఈ పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

#USPC Agitation#Teachers Unions#USPC#Telangana#Telangana Govt#Telangana Teachers#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి