Viral Video: పోలీస్ శాఖకు చెందిన వాహనాలను డిపార్ట్ మెంట్ పనుల కోసం మాత్రమే వాడతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. పోలీస్ శాఖకు చెందిన వాహనాలను డిపార్ట్ మెంట్ పనుల కోసం తప్ప మరో దానికి వాడకూడదు. అది నిబంధనలకు విరుద్ధం. వ్యక్తిగత అవసరాలకు కూడా వాటిని వాడుకోవడానికి లేదు. అలా కాకుండా వ్యక్తిగత పనుల కోసం వాడితే రూల్స్ ను బ్రేక్ చేయడం అవుతుంది.
తాజాగా అంతకుమించిన ఒక ఘటన జరిగింది. పోలీస్ మొబైల్ వాహనంతో ఏకంగా ర్యాపిడోలో సేవలు అందిస్తున్నారు. డిపార్ట్ మెంట్ పనులకు వాడాల్సిన బైక్ ను ఎంచక్కా ర్యాపిడో రైడ్స్ కోసం వాడేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్న వైనం కలకలం రేపుతోంది.
ర్యాపిడోలో పోలీస్ వాహన సేవలు అందిస్తున్న ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ పోలీస్ మొబైల్ వాహనం ర్యాపిడో యాప్‌లో నడుస్తున్నట్లు కనిపించగా, ఓ వ్యక్తి కస్టమర్ లాగా బుకింగ్ చేశాడు. ఆ తర్వాత పికప్ నుంచి డ్రాప్ వరకు మొత్తం ప్రయాణాన్ని వీడియో తీశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. అయితే ఈ పోలీస్ మొబైల్ వాహనం వరంగల్ కమిషనరేట్‌కు చెందినదా..? లేక కరీంనగర్ కమిషనరేట్‌కు చెందినదా..? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
రూల్స్ కు విరుద్ధంగా పోలీస్ మొబైల్ వాహనాన్ని ఇలా ర్యాపిడో రైడ్స్ కు ఉపయోగించడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఇదెక్కడి విడ్డూరం అని అంతా విస్తుపోతున్నారు. ఈ ఘటనపై సంబంధిత పోలీసు అధికారులు వెంటనే విచారణ చేపట్టాలని, వాస్తవాలు ఏంటో వెల్లడించాల్సి ఉంది.
బైక్ ఎక్కేముందు కస్టమర్ ఆ రైడర్ తో ఇలా అన్నాడు. ఇది పోలీస్ వెహికల్ కదా అని అడిగాడు. దానికి ఆ రైడర్.. అన్నా ఇది మా ఫ్రెండ్ వెహికల్. నా వెహికల్ మా ఫ్రెండ్ తీసుకెళ్లాడు అని చెబుతాడు. పోలీస్ బండ్ల మీద ఇలా ర్యాపిడో నడపొచ్చా అని కస్టమర్ అడుగుతాడు. దానికి ఆ రైడర్..నా బండి మా ఫ్రెండ్ తీసుకెళ్లాడు అని చెప్పాడు. మీ ఫ్రెండ్ కానిస్టేబుల్లా అని కస్టమర్ అడగ్గా.. అవునని ఆ రైడర్ చెబుతాడు. ఎక్కడ పని చేస్తాడు అంటే వరంగల్ అని చెప్పడం ఆ వీడియోలో ఉంది.












