స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

SWECHAA Exclusive: ఫార్ములా-ఈ రేసుల కుంభకోణం.. ఏసీబీ ఛార్జ్‌షీట్‌లో కేటీఆర్‌పై సంచలన అభియోగాలు!

రచన: Swechaanews Chairman13 నిమిషాల పఠనం

తెలంగాణ రాజకీయాల్లో ఫార్ములా-ఈ రేసుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఫార్ములా-ఈ రేసుల నిర్వహణ, నిధుల వినియోగంపై సమగ్ర దర్యాప్తు జరిపిన దర్యాప్తు సంస్థ (ఏసీబీ), మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురు అధికారులు, ప్రైవేట్ వ్యక్తులపై సంచలన అభియోగాలతో ముగింపు నివేదికను సేకరించింది. ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు ఒక పథకం ప్రకారం రహస్య అవగాహనతో నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు ఆధారాలు లభించాయని దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది.

  • టీ-హబ్ వేదికగా కుట్ర..

  • రేసుల ఒప్పందం వెనుక అసలు కథ!

  • 'క్విడ్ ప్రో కో' దందా బయటపెట్టిన ఏసీబీ!

  • రూల్స్ అన్నీ పక్కనబెట్టి.. రూ.46కోట్లు నేరుగా ఎఫ్ఈవో ఖాతాలోకి!

  • ప్రజాధనంపై ఏకంగా రూ.2వేల కోట్ల భారం!

  • అవినీతి నిరోధక చట్టం కింద కేటీఆర్‌పై తీవ్రమైన సెక్షన్లు!

స్వేచ్ఛ న్యూస్ ఎక్ల్సూజివ్

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,

స్వేచ్ఛ చైర్మన్, 9848070809

 తెలంగాణ రాజకీయాల్లో ఫార్ములా-ఈ రేసుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఫార్ములా-ఈ రేసుల నిర్వహణ, నిధుల వినియోగంపై సమగ్ర దర్యాప్తు జరిపిన దర్యాప్తు సంస్థ (ఏసీబీ), మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురు అధికారులు, ప్రైవేట్ వ్యక్తులపై సంచలన అభియోగాలతో ముగింపు నివేదికను సేకరించింది. ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు ఒక పథకం ప్రకారం రహస్య అవగాహనతో నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు ఆధారాలు లభించాయని దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది.

ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (A1), ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ (A2), బీఎల్‌ఎన్ రెడ్డి (A3), గోవాడ కిరణ్ మల్లేశ్వరరావు (A4), ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్-FEO (A5)లను నిందితులుగా పేర్కొంటూ క్రిమినల్ కుట్ర, నమ్మకద్రోహం, ప్రభుత్వ ధనం దుర్వినియోగం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడానికి తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది.

 ఏసీబీ దర్యాప్తు నివేదిక ప్రకారం కేటీఆర్ (A1) పై నమోదైన ప్రధాన అభియోగాలు, అక్రమాల వివరాలు

1. నేరపూరిత కుట్ర, అధికార దుర్వినియోగం
ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ (A2), బి.ఎల్.ఎన్. రెడ్డి (A3) తదితరులతో కలిసి రహస్యంగా కుమ్మక్కై, తమ అధికార పరిధిని దాటి నేరపూరిత కుట్రకు పాల్పడటం.

2. ఎలక్టోరల్ బాండ్లతో క్విడ్ ప్రో కో (ప్రతిఫలం) దందా
ప్రమోటర్ సంస్థ (Ace Nxt Gen) అనుబంధ కంపెనీల నుంచి బీఆర్ఎస్ పార్టీకి దాదాపు రూ.44 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు పొంది, దానికి ప్రతిఫలంగా ఫార్ములా-ఈ ఈవెంట్ బాధ్యతలను ఆ సంస్థకు కట్టబెట్టడం.

3. నిబంధనలు, చట్టపరమైన అనుమతుల ఉల్లంఘన
మంత్రి హోదాలో కేబినెట్ ఆమోదం, ఆర్థిక శాఖ సమ్మతి, న్యాయ శాఖ సంప్రదింపులు, మున్సిపల్ విధానాలు మరియు ఎన్నికల ప్రవర్తనా నియమావళి (MCC) నిబంధనలను ఉద్దేశపూర్వకంగా త్రోసిపుచ్చి ఒప్పందాలు చేసుకోవడం.

4. అక్రమ నిధుల మళ్లింపు
ఎలాంటి అధికారిక ఒప్పందం లేకపోయినప్పటికీ, దర్యాప్తులో A5గా ఉన్న ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ (FEO) సంస్థకు హెచ్‌ఎమ్‌డీఏ (HMDA) ఖజానా నుంచి నేరుగా దాదాపు రూ.46.82 కోట్లు బదిలీ అయ్యేలా ఆదేశాలు ఇవ్వడం.

5. రాష్ట్ర ఖజానాపై రూ. 600 కోట్ల మేర భారం మోపడం
ప్రమోటర్ సంస్థ భారీ నష్టాల్లో కూరుకుపోవడంతో, నిబంధనలకు విరుద్ధంగా రాబోయే 3 సీజన్లకు (సీజన్ 10, 11, 12) సంబంధించిన సుమారు రూ.600 కోట్ల ఆర్థిక బాధ్యతను ప్రభుత్వ సంస్థ అయిన హెచ్‌ఎమ్‌డీఏపై రుద్దడం.

6. ప్రజాధనానికి వేల కోట్ల నష్టం కలిగించే ప్రయత్నం
పది సీజన్ల కాలపరిమితితో (£150 మిలియన్ల ప్రమోటర్ ఫీజు + ఇతర మౌలిక వసతుల వ్యయం) సుమారు రూ.2వేల కోట్లకు పైగా ప్రభుత్వ నిధులను ప్రమాదంలోకి నెట్టేలా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం.

7. అవినీతి నిరోధక చట్టం కింద నేరాలు
ప్రభుత్వ ధనానికి అపార నష్టం కలిగిస్తూ బిఆర్ఎస్ పార్టీకి, ప్రమోటర్ సంస్థకు అక్రమ లాభాలు చేకూర్చినందుకుగాను అవినీతి నిరోధక చట్టం (Prevention of Corruption Act), ఐపీసీలోని నమ్మకద్రోహం, కుట్రకు సంబంధించిన తీవ్రమైన సెక్షన్ల కింద బాధ్యులను చేయడం.

టీ-హబ్ సమావేశంతో కుట్రకు పునాది

డిసెంబర్ 2021లో టి-హబ్ (T-Hub) ప్రాంగణంలో నాటి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన, మహీంద్రా రేసింగ్ సీఈఓ దిల్‌బాగ్ గిల్, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావులతో పాటు ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారుల సమక్షంలో జరిగిన రహస్య సమావేశంతోనే ఈ శ్రేణి అక్రమాలకు పునాది పడిందని ఏసీబీ పేర్కొంది. సదరు సమావేశంలోనే ఎల్‌వోఐ (LOI)పై కేటీఆర్ సమక్షంలో సంతకాలు జరగగా, సీజన్-10 నిధుల కేటాయింపు నోట్‌ను కూడా ఆయనే ఆమోదించారు. ముందస్తు ఆర్థిక అనుమతులు దాటవేసి, వాస్తవాలను తప్పుగా చూపిస్తూ బిఆర్ఎస్ పార్టీకి, ప్రమోటర్ సంస్థకు అక్రమ లాభాలు చేకూర్చేందుకు వ్యవస్థలను నిర్వీర్యం చేశారని చార్జ్‌షీట్ స్పష్టం చేసింది.

పాలనా వ్యవస్థపై విమర్శలు – చట్టపరమైన చర్యలకు సిద్ధం

కేటీఆర్ దాదాపు ఎనిమిదేళ్ల పాటు మంత్రిగా పనిచేసినప్పటికీ, రాజ్యాంగపరమైన, పరిపాలనాపరమైన నిబంధనలను ఉద్దేశపూర్వకంగా త్రోసిపుచ్చారని ఏసీబీ ఆరోపించింది. కేబినెట్ ఆమోదం, ఆర్థిక శాఖ సమ్మతి, న్యాయ శాఖ సంప్రదింపులు, మున్సిపల్ విధివిధానాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి (MCC) క్లియరెన్సులు లేకుండానే నిధులను విదేశీ సంస్థకు బదిలీ చేసేందుకు ఆదేశాలు ఇచ్చారని వివరించింది. ఏసీబీ నివేదికలో వెల్లడైన ఈ అంశాలు తెలంగాణ పాలనా వ్యవస్థ తీరుపై తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

ఒక బాధ్యతాయుతమైన మంత్రి, నిబంధనలను పాటించకుండా ఒక ప్రైవేట్ ఈవెంట్ కోసం ప్రభుత్వ సంస్థలను, ప్రజాధనాన్ని స్వప్రయోజనాలకు ఎలా వాడుకున్నారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అధికారుల సహకారంతో చట్టపరమైన అనుమతులను పక్కనబెట్టి నడిపిన ఈ వ్యవహారంపై అవినీతి నిరోధక చట్టం ఐపీసీలోని తీవ్రమైన నేరపూరిత సెక్షన్ల కింద A1 నుంచి A5 వరకు ఉన్న నిందితులందరిపై కఠిన చర్యలకు ఏసీబీ ముగింపు నివేదికలో సిఫార్సు చేసింది.

కేటీఆర్‌పై నమోదైన ప్రధాన సెక్షన్లు.. అమలయ్యే శిక్షలు

1.IPC సెక్షన్ 409 – ప్రజా సేవకుడిగా నమ్మకద్రోహం (Criminal Breach of Trust by Public Servant)
ఛార్జ్‌షీట్ ప్రకారం, ప్రజా సేవకుడిగా ఉన్న కేటీఆర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, హెచ్‌ఎండీఏ నిధుల వినియోగంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రభుత్వానికి నష్టం కలిగించేలా వ్యవహరించారని ఏసీబీ ఆరోపించింది. ఈ అభియోగాన్ని IPC సెక్షన్ 409 కింద నమోదు చేసింది. ఈ సెక్షన్ కింద యావజ్జీవ కారాగార శిఖ లేదా గరిష్ఠంగా 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. అదనంగా జరిమానా కూడా విధిస్తారు.


2. IPC సెక్షన్ 120-B – క్రిమినల్ కుట్ర (Criminal Conspiracy)
కేటీఆర్‌తో పాటు ఇతర అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు కలిసి ముందస్తు కుట్ర ద్వారా ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఏసీబీ పేర్కొంటూ IPC సెక్షన్ 120-Bను జోడించింది. ఈ సెక్షన్ ప్రకారం.. కుట్ర జరిగిన అసలు నేరానికి ఏ శిక్ష ఉంటుందో అదే శిక్ష వర్తిస్తుంది. తీవ్రమైన నేరాల్లో ఇది యావజ్జీవ కారాగార శిక్ష వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇతర సందర్భాల్లో 6 నెలల వరకు జైలు, లేదా జరిమానా, లేదా రెండూ విధించవచ్చు.


3. అవినీతి నిరోధక చట్టం, 1988 – సెక్షన్ 13(1)(a)
ప్రజా సేవకుడు తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, ప్రభుత్వానికి నష్టం కలిగిస్తూ ఇతరులకు అక్రమ లాభం చేకూర్చినట్లు ఆరోపణలు ఉంటే ఈ సెక్షన్ వర్తిస్తుంది. అవినీతి నిరోధక చట్టం, 1988లోని సెక్షన్ 13(1)(a) కింద నమోదైన నేరం రుజువైతే, అదే చట్టంలోని సెక్షన్ 13(2) ప్రకారం కనీసం 4 సంవత్సరాల నుంచి గరిష్ఠంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.


4. అవినీతి నిరోధక చట్టం – సెక్షన్ 13(2)
సెక్షన్ 13(1)(a) కింద పేర్కొన్న అవినీతి నేరాలకు శిక్షను నిర్దేశించే నిబంధన ఇదే. కనీసం 4 సంవత్సరాల జైలు శిక్ష, గరిష్ఠంగా 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. అదనంగా జరిమానా కూడా విధిస్తారు.


5. అవినీతి నిరోధక చట్టం – సెక్షన్ 12
ఛార్జ్‌షీట్‌లో ఈ సెక్షన్ కూడా చేర్చబడింది. ఇది అవినీతి నేరానికి ప్రేరేపించడం (Abetment) లేదా సహకరించడం వంటి అంశాలకు సంబంధించిన నిబంధన. ఈ సెక్షన్ ప్రధానంగా ప్రైవేట్ వ్యక్తులు లేదా ఇతర సహకారుల పాత్రకు సంబంధించింది. కనీసం 3 సంవత్సరాల జైలు శిక్షగరిష్ఠంగా 7 సంవత్సరాల జైలు శిక్ష, అదనంగా జరిమానా విధిస్తారు.

ఈ కేసులో కేటీఆర్‌పై నమోదైన సెక్షన్లలో అత్యంత తీవ్రమైనది IPC సెక్షన్ 409. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే యావజ్జీవ కారాగార శిక్ష వరకు పడే అవకాశం ఉంది. అదనంగా అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2) కింద గరిష్ఠంగా 10 సంవత్సరాల జైలు, సెక్షన్ 12 కింద గరిష్ఠంగా 7 సంవత్సరాల జైలు శిక్షకు కూడా అవకాశం ఉంది. అయితే అన్ని శిక్షలు కలిపి ఎంత అమలవుతుందనేది విచారణ అనంతరం కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

#KTR Formula E Case#ACB Chargesheet KTR#Formula E Scam Telangana#Electoral Bonds Controversy#HMDA Funds Scam#BRS Party News#swechaa exclusive#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి