Minister Uttam Kumar Reddy: సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) వ్యవస్థపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎంఆర్ డిఫాల్టర్లను ముందుగానే గుర్తించేందుకు ‘ఎర్లీ వార్నింగ్ సిస్టమ్’ అమలుపై అధికారులతో మంత్రి చర్చించారు. గత 10-12 ఏళ్ల సీఎంఆర్ కార్యకలాపాలు, ధాన్యం సేకరణ, మిల్లర్లకు అప్పగించిన నిల్వలు, ప్రభుత్వానికి రావాల్సిన బియ్యంపై సమగ్ర సమీక్ష చేశారు. జిల్లా, సంవత్సరం, మిల్లుల వారీగా సీఎంఆర్ డిఫాల్టర్ల వివరాలు, పెండింగ్ బకాయిలు, రికవరీ పురోగతిపై ప్రత్యేక పరిశీలన చేశారు.
ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి క్వింటాల్ బియ్యం, ప్రతి రూపాయి బకాయిని వసూలు చేయడమే లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. డిఫాల్టర్ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ, సివిల్-క్రిమినల్ చర్యలు, ఆస్తుల జప్తు, బ్యాంకు గ్యారంటీల ద్వారా బకాయిల వసూళ్లపై చర్చించారు. సీఎంఆర్ అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు, నమోదైన కేసులు, దర్యాప్తులు, టెండర్ ప్రక్రియలు, కోర్టు వివాదాలపై సమీక్ష చేశారు.
రైతులు, ప్రభుత్వ ప్రయోజనాల పరిరక్షణకు సీఎంఆర్ వ్యవస్థలో సంస్కరణలు, సాంకేతిక ఆధారిత పర్యవేక్షణ, శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.












