తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సింగరేణి అంశం హాట్ టాపిక్‌గా మారింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరేణి సంస్థను ఆర్థికంగా బలహీనపరిచారని ఆరోపించిన ఆయన.. ఇప్పుడు తనపైనే నిందలు వేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు..
సింగరేణికి నిజంగా అన్యాయం చేసిందెవరో చర్చించేందుకు తాను సిద్ధమని కేటీఆర్‌కు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. తాను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే సింగరేణికి వరుసగా కోల్ బ్లాక్‌లు దక్కుతున్నాయని పేర్కొన్నారు. తాజాగా మణుగూరు పీకేఓసీ-2 డిప్ సైడ్ కోల్ బ్లాక్ కేటాయింపు సంస్థ భవిష్యత్తుకు ఎంతో కీలకమని చెప్పారు. గతంలో తాడిచర్ల కోల్ బ్లాక్ కూడా సింగరేణికే దక్కిందని గుర్తు చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల సింగరేణికి సంబంధించిన సుమారు రూ.54 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే రాష్ట్ర బీజేపీ తరఫున ఉద్యమం చేస్తామని, కార్మిక సంఘాలు కూడా ఈ అంశంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
ఇక రాష్ట్ర పాలనపై కూడా కేంద్ర మంత్రి విమర్శలు గుప్పించారు. గత రెండేళ్లలో అధికారుల బదిలీలు మ్యూజికల్ చైర్ ఆటలా మారిపోయాయని అన్నారు. తరచూ బదిలీలు చేయడం వల్ల అధికారుల్లో అనిశ్చితి, ఆందోళన పెరుగుతోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన తల్లిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన కేసులో చర్యలు తీసుకున్న పోలీసు అధికారిని ప్రభుత్వం బదిలీ చేయడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే అధికార వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. అలాగే 2020తో పోలిస్తే 2024 నాటికి సైబర్ క్రైమ్ కేసులు భారీగా పెరిగాయని పేర్కొంటూ.. అలాంటి పరిస్థితుల్లో చట్టప్రకారం చర్యలు తీసుకోవడాన్ని ఎందుకు తప్పుబడుతున్నారని ప్రశ్నించారు.
ఏ సోషల్ మీడియా సంస్థ అయినా, ఎంత పెద్ద మల్టీనేషనల్ కంపెనీ అయినా భారత రాజ్యాంగం, భారత చట్టాలకు లోబడే పనిచేయాల్సిందేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఎవరిపైనైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.
అలాగే రాజకీయాల్లో హుందాతనం తగ్గిపోతోందని వ్యాఖ్యానించిన కిషన్ రెడ్డి.. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమేనని, స్థానిక పరిస్థితులు, అభ్యర్థుల బలం వంటి అనేక అంశాలు ఫలితాలను ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పై బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది..












