కర్నాటక సీఎం డీకే శివకుమార్ ఎమ్మెల్యేలపై కీలక వ్యాఖ్యలు చేశారు.. మంత్రి పదవులు రాని నేతలు ఓపికతో ఉండాలని సూచించిన ఆయన.. ఎమ్మెల్యేలు ఎవరైనా రాజీనామా చేస్తే నిమిషాల్లోనే ఆమోదిస్తానని స్పష్టం చేశారు. కొత్త మంత్రులతో నిన్న సమావేశమైన డీకే.. వీరేంద్ర పాటిల్ హయాంలో బంగారప్పకు, ధరంసింగ్‌కు, ఖర్గేకు కూడా అవకాశాలు రాలేదని కానీ తర్వాత వాళ్లు మంచి పొజిషన్లకు వెళ్లారని గుర్తు చేశారు.
గతంలో తనకు కూడా ఎన్నోసార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని, ధరంసింగ్, సిద్ధరామయ్య హయాంలో తనను కూడా పక్కనపెట్టారని, అయినప్పటికీ పార్టీని వీడలేదని తెలిపారు. అందరూ ఓపికతో ఉంటేనే పార్టీ ఉంటుందని, పార్టీ ఉంటేనే భవిష్యత్ ఉంటుందని డీకే సూచించారు. మరోవైపు కర్నాటకలోని అన్ని బోర్డులు, కార్పొరేషన్లలో కొత్త నియామకాలు త్వరలో చేపట్టడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు తెలిపారు.
మరోవైపు కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ తర్వాత కాంగ్రెస్‌లో అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలకే తొలి ప్రాధాన్యం ఇస్తామని సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. బుధవారం నుంచే రాష్ట్రంలోని కరువు ప్రభావిత జిల్లాల్లో పర్యటించి, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని కొత్త మంత్రులను ఆదేశించారు.
ఇక తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో మొత్తం 19 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, మంత్రి పదవి దక్కకపోవడంతో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎస్.ఆర్. శ్రీనివాస్ కర్ణాటక ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన వారికి రాజకీయాల్లో ఎదగడం చాలా కష్టమని, పెద్దల అండదండలు లేదా ఆర్థిక బలం లేకుంటే అవకాశాలు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు, విజయనగర ఎమ్మెల్యే ఎం. కృష్ణప్పకు మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, మహిళా, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, యువజన కాంగ్రెస్ నాయకులు సామూహిక రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీకే హరిప్రసాద్‌కు పంపించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు సీనియర్ మంత్రులు కృష్ణప్ప నివాసానికి వెళ్లినా, ఆయన అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు.
అదేవిధంగా మహిళా కోటాలో ఒక మంత్రి పదవి ఖాళీగా ఉండటంతో ఆ స్థానంపై లాబీయింగ్ జోరందుకుంది. సందూరు ఎమ్మెల్యే అన్నపూర్ణ తుకారాం, సీఎం డీకే శివకుమార్‌ను కలిసి తన వాదన వినిపించారు. మరోవైపు, మంత్రి పదవి రాకపోవడంతో రాజీనామా చేస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే బేలూరు గోపాలకృష్ణ, సీఎంతో సమావేశం అనంతరం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.












