ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల కోసం కాలేజీలు విద్యార్థులు, వారి పేరెంట్స్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్ రానందున డబ్బులు చెల్లించాల్సిందేనని తాజాగా యాజమాన్యాలు విద్యార్థులకు అల్టిమేటం జారీ చేశాయి. అందుకోసం ఆగస్టు 15వ తేదీని గడువుగా ప్రకటించాయి.ఇదిలాఉండగా, 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) విధానంలో నేరుగా అర్హులైన విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసిన విషయం తెలిసిందే.
హైకోర్టు ఆదేశాల మేరకే..
ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీం కింద ప్రయివేటు కాలేజీల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు తాజాగా ఓ ప్రయివేటు బీటెక్ కాలేజీ కీలక ప్రకటన విడుదల చేసింది. ‘ప్రభుత్వం విద్యార్థుల ఖాతాల్లో జమ చేసే నిధులు కేవలం కాలేజీ ట్యూషన్ ఫీజు చెల్లింపు కోసం మాత్రమేనని హైకోర్టు చెప్పింది. డబ్బులు ఖాతాలో పడగానే వెంటనే పూర్తి మొత్తాన్ని కాలేజీకి ఫీజు రూపేణా చెల్లించాలి. ఫండ్స్ విడుదలకు గాను హైకోర్టు ప్రభుత్వానికి ఆగస్టు 15 వరకు గడువు ఇచ్చింది.
ఒకవేళ ప్రభుత్వం ఆలోగా రీయింబర్స్ మెంట్ నిధులను విద్యార్థుల ఖాతాల్లో జమ చేయకపోతే.. కోర్టు ఆర్డర్ ప్రకారం విద్యార్థులే స్వయంగా ట్యూషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. డీబీటీ విధానం అమలవుతున్నందున ప్రభుత్వం నుంచి నిధులు నేరుగా కాలేజీ ఖాతాలోకి రావు. అందుకే ఫీజు సకాలంలో చెల్లించే బాధ్యత పూర్తిగా విద్యార్థులదే. రీయింబర్స్‌మెంట్ రూపంలో వచ్చిన డబ్బులను కాలేజీ ఫీజు కోసం కాకుండా ఇతర అవసరాలకు ఉపయోగిస్తే, ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆ ఫండ్స్‌ను రికవరీ చేసే అవకాశం ఉంది’అని యాజమాన్యం పేర్కొంది.
ఇదిలాఉండగా, కాలేజీ యాజమాన్యం ప్రకటనపై విద్యార్థిసంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న డీబీటీ విధానంతో పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నప్పటికీ, నిధుల విడుదలలో జాప్యం జరిగితే కాలేజీల నుంచి వచ్చే ఒత్తిడిని ఎలా తట్టుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












