గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు నాసిరకం భోజనం అందజేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం పర్యవేక్షణ, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కాంట్రాక్టర్లు రెచ్చిపోతున్నారు. ఆ భోజనం తినేది పిల్లలు అని కూడా చూడకుండా పురుగులు పట్టిన అన్నం, కుళ్లిపోయిన కూరగాయాలు తీసుకొచ్చి వంటలు చేసిన వారికి వడ్డిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్రను వీడటం లేదు. అధికారులు సైతం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు.
ఏదైనా సీరియస్ ఘటన జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేస్తున్న అధికారులు.. ఆ తర్వాత విద్యార్థులకు మంచి భోజనం పెడుతున్నారా? లేదా? అని కనీసం ఆరా తీయడం లేదని సమాచారం. అప్పుడప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లాలని జిల్లాల కలెక్టర్లకు సీఎం నుంచి ఆదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ వారు కూడా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఫలితంగా విద్యార్థులు నాసిరకం భోజనం చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అకడమిక్ ఇయర్ ప్రారంభమైన కొద్దిరోజుల్లో ఇప్పటికే మూడు సార్లు ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగిన విషయం తెలిసిందే.
తాజాగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ అమ్మాయిల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థినులకు పురుగుల అన్నం, పుచ్చిపోయిన కూరగాయలతో భోజనం వడిస్తున్నట్టు తెలిసింది. దీనిపై వివరణ కోరిన పత్రికా విలేకరులపై, “అడగడానికి మీరెవరు? మీరు ఎందుకు లోపలికి వచ్చారు?” అంటూ ప్రిన్సిపాల్ డి.మాధురి రెచ్చిపోయినట్టు తెలిసింది. 530 మంది విద్యార్థినులు ఉన్న పాఠశాలలో కల్తీ, నాణ్యతలేని ఆహారం తయారు చేసి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్టు సమాచారం.
కాగా, గతంలో ఇదే పాఠశాలలో బాలికలను శారీరకంగా వేధించి, ఓ ఉపాధ్యాయుడు పోక్సో కేసులో బుక్కైన విషయం తెలిసిందే. గురుకుల బాలికల పాఠశాలలో నిత్యం వివాదాలు జరుగుతున్నా అధికారుల తీరు ఏమాత్రం మారడం లేదు. పుడ్ పాయిజన్ జరిగిన ఘటనల్లో తమ పిల్లల కోసం చాలా మంది పేరెంట్స్ కంటతడిపెట్టిన ఘటనలు ఉన్నాయి.అవి చూసి కూడా వీరి మనసు కరగడం లేదని విమర్శలు వస్తున్నాయి.












