ప్రముఖ హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తన సరికొత్త భారీ చిత్రం 'ది ఒడిస్సీ' ప్రమోషన్స్ కోసం భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న ముంబై నగరంలో ఏర్పాటు చేసిన ఈ సినిమా ప్రత్యేక ప్రీమియర్ షోకు ఆయనతో పాటు చిత్ర కథానాయకులు మ్యాట్ డామన్, టామ్ హాలండ్‌లు కూడా హాజరయ్యారు. అయితే, ఈ గ్రాండ్ ఈవెంట్‌కు వెళ్లే ముందు ఈ ముగ్గురు సెలబ్రిటీలు ముంబైలోని ఒక సాధారణ స్థానిక కేఫ్‌లో ఆగి, ఎంతో సరదాగా చాయ్ తాగుతూ కనిపించడం ప్రస్తుతం సాషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ ముగ్గురు స్టార్ల ముంబై సందర్శనకు సంబంధించిన ఫొటోలు మరియు వీడియోలను 'యూనివర్సల్ పిక్చర్స్ ఇండియా' సంస్థ తమ అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా పంచుకుంది. ఈ సందర్భంగా.. "ది ఒడిస్సీ ముంబై ప్రీమియర్ ప్రదర్శనకు ముందు ఒక చిన్న టీ బ్రేక్. ఈ రాత్రి మాకు ఎంతో పెద్దది, ప్రత్యేకమైనది. కానీ, అన్నింటికంటే ముందు చాయ్ ముఖ్యం!" అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది. ఈ వీడియోలో నోలన్, మ్యాట్ డామన్, టామ్ హాలండ్‌లు కేఫ్‌లో కూర్చుని చాయ్‌తో పాటు ముంబై స్పెషల్ 'బన్ మస్కా', కొన్ని రుచికరమైన డెజర్ట్‌లను ఎంతో ఇష్టంగా తింటూ ఎంజాయ్ చేయడం కనిపించింది.
ప్రసిద్ధ గ్రీకు ఇతిహాస రచయిత హోమర్ రాసిన కథ ఆధారంగా క్రిస్టోఫర్ నోలన్ ఈ 'ది ఒడిస్సీ' చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఆయన భార్య ఎమ్మా థామస్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ భారీ యాక్షన్ డ్రామాలో యాన్ హథవే, రాబర్ట్ ప్యాటిన్సన్, జెండయా, చార్లీజ్ థెరాన్ వంటి హాలీవుడ్ అగ్ర నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. గతేడాది ఆస్కార్ అవార్డుల పంట పండించిన 'ఓపెన్‌హైమర్' వంటి సంచలన చిత్రం తర్వాత నోలన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
సాంకేతిక పరంగా కూడా ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించబోతోంది. సినిమా చరిత్రలోనే సరికొత్తగా, పూర్తిగా ఐమ్యాక్స్ (IMAX) కెమెరాలతో మాత్రమే చిత్రీకరించిన మొట్టమొదటి పూర్తి నిడివి ఫీచర్ ఫిల్మ్‌గా ఇది రికార్డు పుటల్లోకి ఎక్కనుంది. ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ దృష్ట్యా, దీని 70ఎంఎం స్క్రీనింగ్ టికెట్లను దాదాపు ఏడాది ముందే, అంటే 2025 జులైలోనే ముందస్తు అమ్మకానికి పెట్టడం విశేషం. యూనివర్సల్ పిక్చర్స్ పంపిణీ చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ఒడిస్సీ’ ఈ నెల 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
https://x.com/AfjalKhan991627/status/2075988833615913398?s=20












